సింధూ జలాల నిలిపివేతపై పాక్ అక్కసు
- భారత్ చర్యపై అక్కడి మంత్రుల ప్రేలాపనలు
- సైనిక చర్య తప్పదంటూ కవ్వింపు చర్యలు
- అయినప్పటికీ ఏమాత్రం తలొగ్గని భారత్
- జలాల నిలిపివేత కొనసాగుతుందని ఇప్పటికే స్పష్టీకరణ
ఇస్లామాబాద్, జూన్ ౩౦: సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ బుట్టదాఖలు చేయడంతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరవుతున్నది. ఒప్పందం విషయంలో యుద్ధానికైనా సిద్ధమేనంటూ కవ్వింపులకు పాల్పడుతున్నది. తాజాగా మంగళవారం మరోసారి భారత్‌పై ప్రేలాపనలు చేసింది. సింధూ జలాల్లో తమ వాటా తీసుకొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ అక్కసు వెళ్లగక్కాడు.
జలాల నియంత్రణకు భారత్ ప్రయత్నిస్తున్నదనేది ఆయన వాదన. పాకిస్తాన్‌లోకి చుక్క నీరు కూడా రానీయకుండా భారత ప్రధాని నరేంద్ర మోదీ అడ్డుకుంటున్నారని అక్కడి మంత్రి విమర్శించారు. తమ నీటి హక్కులకు ముప్పు వాటిల్లితే ఊరుకునేది లేదని తాటాకు చప్పుళ్లు చేసి అంతర్జాతీయ సమాజంలో నవ్వుల పాలవుతున్నారు. సిందూ జలాల ఒప్పందం ప్రకారం తమకు దక్కాల్సిన నీటి వాటాను పరిరక్షించుకుని తీరుతామంటూ మంగమ్మ శపథం చేశారు.
ఒకవైపు ఉగ్రవాదులకు స్థావరాలిస్తూ, ఉగ్రవాదాన్ని పోషిస్తూ, మరోవైపు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుండటం విమర్శలకు తావిస్తున్నది. అదే ఉగ్రవాదుల మూక గతేడాది కశ్మీర్‌లోని పహల్గాంలో ౨౧మంది భారతీయులను పొట్టనపెట్టుకున్న సంగతిని ఇప్పటికీ భారతపౌరులు ఎప్పటికీ మరచిపోరు. ఆ తర్వాతే భారత్ సిందూ జలాలను కట్టడి చేసిందన్న సంగతిని పాక్ మరువకూడదు. ఇదే వివాదంపై పాకిస్థాన్ మరో మంత్రి అట్టావుల్లా తరార్ కూడా స్పందించారు.
జలాల వాటా అంశం తమ దేశ జాతీయ భద్రతలో కీలక భాగమంటూ వివరించారు. ఒప్పందం చట్టబద్ధంగా అమలులో ఉందని, భారత్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఇంకో పాక్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్పందిస్తూ భారత్ ఇంకా సింధూ జలాలను అడ్డుకుంటే, సైనిక చర్య తప్పదంటూ వ్యాఖ్యానించారు. పైగా జల వివాదంపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని కోరుతున్నారు.
అసలు ఒప్పందమేంటి?
సింధు, దాని ఉపనదుల జలాల పంపకాలపై 1960లో ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం.. తూర్పున ఉన్న రావి, బియాస్, సట్లెజ్ నదుల జలాలపై భారత్‌కు పూర్తి హక్కులు లభించాయి. పశ్చిమ వైపు ఉన్న సింధు, జీలం, చీనాబ్ నదుల జలాలు పాకిస్తాన్‌కు దక్కాయి. అయితే.. ఈ పశ్చిమ నదులపై భారత్ పరిమితంగా కొన్ని ప్రాజెక్టులు నిర్మించుకునేందుకు వెసులుబాటు వచ్చింది.
ఆ తర్వాత రెండు దేశాల మధ్య మూడు సార్లు యుద్ధం జరిగింది. అయినప్పటికీ ఒప్పందం అమలులోనే ఉంది. గతేడాది పహల్గాంలో ముష్కరుల దుశ్చర్య కారణంగానే భారత్ తన ఒప్పందాన్ని ఉల్లంఘించాల్సి వచ్చింది. భారత్ ఇప్పటికే చీనాబ్ నదిపై రెండు కొత్త ప్రాజెక్టులను చేపట్టింది. చీనాబ్ జలాలను బియాస్ బేసిన్‌కు తరలించే టన్నెల్ ప్రాజెక్టుతోపాటు సలాల్ పవర్ స్టేషన్‌లో పూడికతీత పనులను ప్రారంభించింది. భారత్ తీసుకుంటున్న ఈ చర్యలు తమ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
భారత్ నీటిని ఒక ఆయుధంగా వాడుకుంటున్నదని ఆరోపిస్తున్నది. ఈ వివాదంపై అంతర్జాతీయ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించి తమకు అనుకూలంగా నిర్ణయం తెచ్చుకున్నట్లు పాక్ వాదిస్తున్నది. అయితే ఆ నిర్ణయం చట్టవిరుద్ధమైనదని భారత్ కొట్టిపారేస్తున్నది. తాము ఒప్పందాన్ని నిలిపివేసిన నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ కుండబద్దలు కొట్టింది. ఏదేమైనా.. భారత్ సింధూ జలాల నిలిపివేత చర్యతో పాక్‌కు కోలుకోలేని దెబ్బతగిలిందనేది మాత్రం వాస్తవం.






