21 April, 2026 | 3:34 AM

దసున్ శనకపై పాక్ బోర్డు నిషేధం

21-04-2026 02:11 AM

లాహోర్, ఏప్రిల్ 20: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక టీ20 కెప్టెన్ దసున్ శనకపై ఏడాదిపాటు పీఎస్‌ఎల్లో ఆడకుండా నిషేధం విధించింది. లాహోర్ ఖలందర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాల్సిన శనక.. ఆ టోర్నీ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు.

ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ నుంచి ఆఫర్ రావడంతో పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌కు వచ్చేశాడు. దీన్ని ఒప్పంద ఉల్లంఘనగా భావించిన పీసీబీ శనకపై చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో 2027 పీఎస్‌ఎల్ సీజన్‌లో అతడికి ఆడే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ సామ్ కరన్ గాయపడటంతో అతడి స్థానంలో 2 కోట్లకు శనకను ఆర్‌ఆర్ ఫ్రాంచైజీ జట్టులోకి తీసుకుంది. ఈ విషయంపై సమీక్ష నిర్వహించిన పీసీబీ.. శ్రీలంక క్రికెటర్ శనక నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేల్చింది.

టోర్నమెంట్ నుంచి ఏకపక్షంగా వైదొలగినట్లు పేర్కొంటూ అతడిపై ఏడాది నిషేధం విధించింది. తన నిర్ణయంపై శనక పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు పీసీబీ తెలిపింది. పీఎస్‌ఎల్ నుంచి తప్పుకోవడం పట్ల క్షమాపణలు కోరుతున్నాననీ, పాకిస్థాన్ అభిమానుల ప్రేమను గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. ఇటీవల ఇదే తరహాలో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానిపై కూడా పీసీబీ రెండేళ్ల నిషేధం విధించడం వివాదాస్పదమైనంది. ఐపీఎల్ కోసం పీఎస్‌ఎల్ను వదిలేశాడనే కారణంతో ఈ చర్య తీసుకుంది. అయితే తన క్లయింట్కు ఎలాంటి ఒప్పందం ఇవ్వలేదని ముజరబాని మేనేజర్ తీవ్రంగా ఖండించారు.