21 April, 2026 | 3:34 AM

అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోండి

21-04-2026 02:08 AM

త్రీడే మ్యాచ్‌లే నిర్వహించాలి

ఏజీఎం ఏర్పాటు చేయండి

హెచ్‌సీఎ సెక్రటరీకి అర్షద్ అయూబ్ విజ్ఞప్తి

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన జీవన్‌రెడ్డికి మాజీ ప్రెసిడెంట్ అర్షద్ అయూబ్ కీలక విజ్ఞప్తి చేశారు. ఎలాంటి నిర్ణయాలైనా అందరితో చర్చించి అమలు చేయాలని కోరారు. దీని కోసం ఏజీఎం నిర్వహించాలని, సభ్యులందరి అభిప్రాయాలు, సూచనలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మాజీ సెక్రటరీలు శేష్‌నారాయణ్, జాన్ మనోజ్‌లతో కలిసి మీడియాతో మాట్లాడిన అర్షద్ అయూబ్ హెచ్‌సీఏలో ఎవరూ బాధ్యతల్లో ఉన్నా క్రికెట్ అభివృద్ధికే కృషి చేయాలని సూచించారు. జీవన్‌రెడ్డిపై తమకు నమ్మకం ఉందని, తెలంగాణ క్రికెట్‌కు మేలు చేసేలా ఆయన వ్యవహించాలని కోరారు.

హెచ్‌సీఏ రాజ్యాంగంలో ఉన్న కొన్ని నిబంధనలు గతంలో పా టించకపోవడం దురదృష్టకరమని, దీనికి ఇకనైనా ముగింపు పలుకుతారని భావిస్తున్నట్టు చెప్పారు. ఇదిలా ఉంటే త్రీడే క్రికెట్ మ్యాచ్‌లను రెండు రోజులకు తగ్గించడం సరికాదని మాజీ సెక్రటరీ జాన్ మనోజ్ వ్యాఖ్యానించారు. టెస్ట్ క్రికెట్‌కు ఎంతోమంది గొప్ప ప్లే యర్స్‌ను అందించిన ఘనత హైదరాబాద్‌కు ఉందనీ, రెండు రోజుల మ్యాచ్‌లతో రెడ్ బాల్ క్రికెట్‌లో ఆటగాళ్లను ఎలా తీర్చిదిద్దుతారని ప్రశ్నించారు.

మూడు రోజుల మ్యాచ్‌లతోనే ఆటగాళ్లకు మేలు జరుగుతుందన్నారు. ఇక బయటి నుంచి మాజీ క్రికెటర్ల ను తెచ్చి వారికి భారీగా డబ్బు వెచ్చించడం కంటే, అర్షద్ అయూబ్ లాంటి మాజీ క్రికెటర్ల సేవలను హైదరాబాద్ రంజీ టీమ్ కోసం ఉపయోగించుకోవాలని మాజీ సెక్రటరీ శేష్ నారాయణ కోరారు. తెలంగాణ టీ20 లీగ్‌ను పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైన వారినే ఆర్గనైజింగ్ కమిటీలో నియమిం చుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్లబ్ సెక్రటరీలకు కాంప్లిమెంటరీ పాసుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.