7 May, 2026 | 12:52 AM

కాలువ కబ్జాపై ఆగ్రహం అధికారులకు స్థానికుల ఫిర్యాదు

07-05-2026 12:07 AM

సహజ సిద్ధంగా పుట్టిన కాలువ పూడ్చివేతతో ముంపు ప్రమాదం

మొయినాబాద్, మే 6 (విజయ క్రాంతి): మొయినాబాద్ మండలంలోని కనకమామిడి రెవెన్యూ పరిధిలో సహజ సిద్ధంగా ఉన్న కాలువను రియల్ ఎస్టేట్ వ్యాపారులు పూడ్చివేస్తూ కబ్జా చేస్తున్నారనే ఆరోపణలతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగమేశ్వర దేవాలయం సమీపం నుంచి ప్రవహిస్తున్న ఈ కాలువను అక్రమంగా ఆక్రమించి, భూసమీకరణ పేరుతో మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం తహసీల్దార్ గౌతమ్ కుమార్, శంకర్పల్లి ఇరిగేషన్ డీఈ చంద్రకాంత్కు వేర్వేరుగా ఫిర్యాదులు అందజేశారు.స్థానికుల ఆరోపణల ప్రకారం, ఎన్నో సంవత్సరాలుగా సహజంగా ప్రవహిస్తున్న కాలువను పూడ్చివేయడం వల్ల వర్షాకాలంలో వరదనీరు దారిమళ్లి సమీప కాలనీలు, వ్యవసాయ భూములు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఇప్పటికే సంగమేశ్వర దేవాలయం పరిసర ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, కాలువ ఆక్రమణలు పెరుగుతున్నాయని తెలిపారు. అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి కాలువను యథాతథంగా పునరుద్ధరించాలని, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాలువలను కాపాడకపోతే రేపు గ్రామాలు ముంపులో మునిగే ప్రమాదం ఉంది అని స్థానికులు హెచ్చరిస్తున్నారు.