23-02-2026 12:49:47 AM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకే వైద్యుడు
ఆప్తాల్మిక్ వైద్యుడిని నియమించాలి
తాడ్వాయి, ఫిబ్రవరి, 22 (విజయక్రాంతి): ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం, ప్రజలకు ఎల్లవేళలా మెరుగైన సేవలు అందిస్తున్నాం అని చెబుతున్న ఆచరణలో మాత్రం జరగడం లేదు ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన సిబ్బంది లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆప్తాల్మిక్ వైద్యుడు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గతంలో కంటి వైద్యుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండడంతో ప్రజలు కంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు నిర్వహించుకునేవారు. ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే సదరు వైద్యుడు సహాయంతో చికిత్సలు నిర్వహించుకుని మందులు తీసుకునేవారు.కానీ గత 3 నెలల నుంచి కంటి వైద్యుడు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదివరలో ఇక్కడ కంటి వైద్యుడిగా విధులు నిర్వహించిన లింబాద్రి పదవి విరమణ పొందడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పోస్టును భర్తీ చేయకపోవడంతో ఎర్ర పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంటి సమస్యలు తలెత్తినప్పుడు కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుని చికిత్సలు చేయించుకుంటున్నారు.
ఎర్రపహాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంచి పేరుంది. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు 100 నుంచి 150 మంది రోగులు చికిత్సలు చేయించుకుంటారు.ఇ ప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఎర్రపహాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కంటి వైద్యుడిని నియమించాలని కోరుతున్నారు. ఒక్క ఎర్ర పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే కాక జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల లో సైతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యాధికారుల పోస్టలు సైతం ఖాళీగా ఉండడంతో ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదు.
ఒక్కో ఆసుపత్రిలో ఇద్దరు వైద్యాధికారులు ఉండాల్సి ఉండగా ఒకే ఒక వైద్యుడు విధులు నిర్వహిస్తున్నారు. సదరు వైద్యాధికారి సెలవులో వెళ్ళినప్పుడు రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో కిందిస్థాయి సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను, ఏఎన్‌ఎం పోస్టులను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఒకే ఒక వైద్యుడు
ఎర్రపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు వైద్యులు ఉండాలి. ఇక్కడ ఇద్దరు వైద్యులు విధులు నిర్వహించాలి. కానీ ఎప్పుడూ ఒక వైద్యుడు పోస్టు ఖాళీగా ఉంటుంది. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో తొమ్మిది సబ్ సెంటర్లు ఉన్నాయి. ఈ సబ్ సెంటర్ల విధి నిర్వహణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు చికిత్సలు నిర్వహించడానికి ప్రభుత్వం ఇద్దరు వైద్యులను ఏర్పాటు చేసింది.కానీ ఈ కేంద్రంలో ఒకే ఒక వైద్యుడు విధులు నిర్వహిస్తున్నారు.
మరోవైద్యుడు ఉన్నత విద్య కోసం సెలవు పెట్టి వెళ్లడంతో ఒక వైద్యుడి పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదు. గత మూడు సంవత్సరాల క్రితమే సదరు వైద్యుడు పీజీ కోసం వెల్లాడని వైద్యాధికారి కాసిం తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కన్కల్, కొండాపూర్, ఎర్ర పహాడ్ సబ్ సెంటర్లలో మొదటి ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు ఏఎన్‌ఎంలు విధులు నిర్వహించాల్సి ఉంది. కానీ మొదటి ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉండడంతో రెండవ ఏ ఎన్ ఎం లే పూర్తిస్థాయి విధులు నిర్వహిస్తున్నారు.
అధికారులు స్పందించి మొదటి ఏఎన్‌ఎం పోస్టులను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆస్పత్రి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాల్సి ఉంది. కానీ కొంతమంది అధికారులు సమయం పాటించకుండానే మధ్యలోనే వెళ్లిపోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎర్రపహాడు ఆరోగ్య కేంద్రంలో అధికారులు పూర్తిస్థాయి సమయాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - -
ఆప్తాల్మిక్ వైద్యుడు పోస్టుని భర్తీ చేయాలి
ఎర్రపహాడు లో ఖాళీగా ఉన్న ఆప్తాల్మిక్ వైద్యుడు పోస్టుని వెంటనే భర్తీ చేయాలి. వైద్యుడు పోస్టు ఖాళీగా ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.గత మూడు నెలల నుంచి పోస్టు ఖాళీగా ఉంది. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన లింబాద్రి పదవి విరమణ పొందాడు. అప్పటి నుంచి పోస్ట్ ఖాళీగా ఉంది. మూడు సబ్ సెంటర్లలో ఖాళీ గా ఉన్న మొదటి ఏఎన్‌ఎం పోస్టులను భర్తీ చేసి సబ్ సెంటర్లలో సమస్యలు తలెత్తకుండా చూడాలి.
కాసిం, వైద్యాధికారి ఎర్రపహాడ్