సైబర్ అనకొండ గుట్టురట్టు!
- 9 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసుల దాడులు
- 32 మంది బ్యాంకు అధికారులతో సహా 52 మంది అరెస్ట్
- రూ.150 కోట్ల మేర మోసాలు.. 850 కేసులతో సంబంధం
- సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌ను ఛేదించిన ఆపరేషన్ ఆక్టోపస్ 2.0
- ‘జీరో టాలరెన్స్’ పకడ్బందీగా అమలు చేస్తున్నాం
- చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరినైనా ఉపేక్షించబోం
- బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం.. నేరగాళ్లకు వరం
- హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్
సికింద్రాబాద్, ఏప్రిల్19 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా సాగుతున్న భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఆపరేషన్ ఆక్టోపస్-2.0 పేరుతో నిర్వహించిన ఈ భారీ ఆపరేష న్‌లో మొత్తం 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిం చి, బ్యాంకు అధికారులు సహా 52 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పెట్టుబడి స్కామ్‌లు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్ట్’ పేరుతో అమాయకులను బెదిరించి భారీగా సొమ్ము దోచుకుంటున్న ముఠాలకు అండగా నిలుస్తున్న బ్యాంకు అధికారులే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగింది.
నిందితుల్లో 32 మంది బ్యాంకు అధికారులు, 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు ఉన్నారు. సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కైన కొందరు బ్యాంకు అధికారులు వారి కోసం అక్రమంగా బ్యాంకు ఖాతాలు (మ్యూల్ అకౌంట్స్) తెరిచి ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి.అరవింద్ బాబు, ఏసీపీ ఆర్‌జీ శివ మారుతి నేతృత్వంలో 16 ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి.
మొత్తం 7 రోజుల పాటు 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి నెట్‌వర్క్‌ను ఛేదించాయి. ఫిబ్రవరిలో నిర్వహించిన ‘ఆపరేషన్ ఆక్టోపస్-1లో 16 రాష్ట్రాల నుంచి 117 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆపరేషన్‌లో వెలుగు చూసిన అంశాల ఆధారంగా ఇప్పుడు రెండో విడతగా ‘ఆపరేషన్ అక్టోపస్-2.ఓ చేపట్టారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ జరిపిన లోతైన దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు నేరగాళ్లు ఏకంగా 350 బ్యాంకు ఖాతాలను వినియోగించారు. ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్ కేసులతో సంబంధం ఉంది. వీటి ద్వారా దాదాపు రూ.150 కోట్ల మేర మోసాలు దర్యాప్తులో తేలింది. బ్యాంకు అధికారులు మోసగాళ్లతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
*బ్యాంకు అధికారుల అరెస్ట్ వివరాలు
బ్యాంకుల పేరు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరో డా, ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్సింద్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్/అసిస్టెంట్ అకౌంట్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్, ప్రొబేషనరీ అధికారి కేవైసీ ఆమోదించేవారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా సైబ ర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాలను ఆటకట్టించేందుకు 16 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలోని ఈ బృందాలు మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ రాష్ట్రా ల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి కీలక నిందితులను, వారికి సహకరిస్తున్న బ్యాంకు అధికారులను అదుపులోకి తీసుకున్నాయి.
ఈ భారీ ఆపరేషన్‌లో భాగంగా నిందితుల నుంచి 26 మొబైల్ ఫోన్లు, 14 చెక్కు పుస్తకాలు, రెండు పెన్ డ్రైవ్లు, ఒక ల్యాప్‌టాప్‌తో పాటు 21 షెల్ కంపెనీల స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్స్ డీసీపీ వి.అరవింద్ బాబు, ఏసీపీ శివ మారు తి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ దాడుల్లో సీసీపీఎస్ అధికారులు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు, ఆర్మ్‌డ్ రిజర్వ్ బలగాలు అత్యం త చాకచక్యం గా వ్యవహరించి, అంతరాష్ట్ర నెట్‌వర్క్‌ను ఛేదించాయి.
సైబర్ నేరాల కట్టడిలో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేస్తున్నామని, చట్టాన్ని ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. ముఖ్యంగా కొన్ని ప్రైవేటు బ్యాంకులు కేవైసీ నిబంధనలను తుంగలో తొక్కుతూ, సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండానే ఖాతాలు తెరవడానికి అనుమతించడం వల్లే ‘మ్యూల్’ ఖాతాలు పుట్టుకొస్తున్నాయని ఆయన చెప్పారు.
బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం.. నేరగాళ్లకు వరం
బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం నేరగాళ్లకు వరంగా మారుతోందని, ఇలాంటి ఉదంతాల్లో బాధ్యులైన వారిపై ఉక్కుపాదం మోపుతామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. బాధితులకు సత్వర న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా దర్యాప్తును ముమ్మరం చేశామని, నేర ముఠాల్లోని కీలక వ్యక్తులను పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతోందని వివరించారు.
నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, అధిక లాభాల పేరుతో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మకూడదని కోరారు. షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టే ముందు సదరు సంస్థలకు సెబీ గుర్తింపు ఉందో లేదో సరిచూసుకోవాలని సూచించారు. దర్యాప్తు సంస్థల పేరుతో వచ్చే వీడియో కాల్స్‌కు భయపడాల్సిన అవసరం లేదని, డిజిటల్ అరెస్టులు చేసే సంస్కృతి ఏ వ్యవస్థలోనూ లేదని స్పష్టం చేశారు.
వ్యక్తిగత బ్యాంకు ఖాతాలను ఇతరులకు వాడటానికి ఇచ్చి, అక్రమాలకు సహకరిస్తే, వారిని కూడా నేరస్థులుగానే పరిగణించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొరపాటున ఎవరైనా సైబర్ మోసానికి గురైతే, విలువైన ‘గోల్డెన్ అవర్’ను వృథా చేయకుండా తక్షణమే 1930 సంబర్‌కు ఫిర్యాదు చేయాలని లేదా <www.cybercrime.gov.in> వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని కోరారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే సైబర్ నేర రహిత సమాజం సాధ్యమవుతుందని సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు.






