25 April, 2026 | 5:59 PM

బిల్లుల చెల్లింపునకు ఆన్ లైన్ సేవలు మేలు

25-04-2026 04:26 PM

- ఎండ తీవ్రత దృష్ట్యా ఇంటి నుంచే బిల్లులు చెల్లించాలి

- లబ్ధిదారులను కోరుతున్న విద్యుత్ శాఖ అధికారులు

మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లాలో ఎండలు రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా విద్యుత్ వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు చేయడం మేలు. విద్యుత్ వినియోగదారుల సౌలభ్యం కోసం నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGNPDCL) డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజు రోజుకు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న తరుణంలో విద్యుత్ బిల్లుల చెల్లింపుల విషయంలో వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా చెల్లించాలని వినియోగదారులను విద్యుత్ శాఖ అధికారులు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం పది శాతం విద్యుత్ వినియోగదారులు తమ నెలవారీ బిల్లులను TGNPDCL యాప్, టి. వ్యాలెట్, Google Pay, PhonePe, Paytm వంటి డిజిటల్ ప్లాట్ ఫారంల ద్వారా చెల్లిస్తున్నారని, ఎండలను దృష్టిలో పెట్టుకొని ఇంటి వద్దనే ఉండి డిజిటల్ చెల్లింపులు మరింత పెంచాలని అవగాహన కల్పిస్తున్నారు.

పెరిగిన డిజిటల్ చెల్లింపులు...

2024- 25 ఆర్థిక సంవత్సరంలో 5,49,697 మంది వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేయగా 2025- 26 ఆర్థిక సంవత్సరంలో 6,48,839 మంది వినియోగదారులు డిజిటల్ విధానం ద్వారా చెల్లింపులు చేసినట్లు సంబంధిత శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. వేసవి తీవ్రత దృష్ట్యా లబ్ధిదారులు ఇంటి వద్ద ఉండి సురక్షితంగా బిల్లులు చెల్లిస్తే డిజిటల్ చెల్లింపులు మరింత పెరిగే అవకాశం ఉంది. 

ఆన్ లైన్ చెల్లింపులతో ప్రయోజనాలు :

1. సౌలభ్యం : కార్యాలయ కౌంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కడి నుంచైనా చెల్లింపు చేయవచ్చు.

2. సమయం ఆదా : కేవలం రెండు నిమిషాల్లో ఆలస్యం లేకుండా చెల్లించవచ్చు.

3. తక్షణ ధృవీకరణ : లావాదేవీలు తక్షణమే నమోదవుతాయి. 

4. సమాచారం : ప్రతి నెల విద్యుత్ బిల్లుల వివరాలు నేరుగా వినియోగదారుని మొబైల్ కు సమాచారం అందుతాయి.

5. పారదర్శకత : అకౌంటింగ్ వ్యవస్థ పారదర్శకంగా, సురక్షితంగా ఉంటుంది.

ఇలా చెల్లించవచ్చు... 

విద్యుత్ వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లోని ప్లే స్టోర్ లో TGNPDCL అని టైప్ చేసి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో విద్యుత్ బిల్లుపై ఉన్న యు ఎస్ సీ (USC) నంబర్ నమోదు చేసుకొని ప్రతి నెల బిల్లులను సులభంగా చెల్లించవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రతి నెల చెల్లించాల్సిన మొత్తంపై ముందస్తు సమాచారం (Alerts) అందుతుంది. 

ఎండ దెబ్బకు గురి కావద్దు - ఎస్ఈ రాజన్న

ప్రస్తుతం ఎండల తీవ్రత (Heat Wave) అధికంగా ఉన్నందున వినియోగదారులు బిల్లుల చెల్లింపు కోసం బయటకు వచ్చి ఎండ దెబ్బకు గురికావద్దని మంచిర్యాల సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (Mancherial SE) బీ రాజన్న (B.Rajanna) కోరారు. వేసవి తాపం దృష్ట్యా వినియోగదారులు విద్యుత్ కార్యాలయాల వద్ద ఉన్న కౌంటర్లకు రావాల్సిన అవసరం లేదని, మీ ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఆన్ లైన్ పద్ధతుల ద్వారా బిల్లులు చెల్లించి ఎండల నుంచి రక్షణ పొందాలని ఆయన సూచించారు. వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా, సేవలను సులభతరం చేయడం, ఆధునీకరించడం దిశగా టీజీఎన్పీడీసీఎల్ (TGNPDCL) నిరంతరం కృషి చేస్తుందన్నారు.