25 July, 2026 | 1:04 PM

విశ్వశాంతి మహాయాగంలో మంత్రి జూపల్లి కృష్ణారావు

25-07-2026 11:43 AM

కల్వకుర్తి జులై 25: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ గ్రౌండ్‌లో ఈ నెల 19వ తేదీ నుంచి నిర్వహిస్తున్న 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) శనివారం పాల్గొన్నారు. ఆయనతో పాటు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాసింగ్ తదితరులు యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అతిథులకు మహాయాగ నిర్వాహకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం యాగ నిర్వాహకులు కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామిని కలిసి ఆశీర్వాదాలు పొందారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు  హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా విశ్వశాంతి మహాయాగానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి వ్రతాలు ఆచరించారు. రుత్వికులు వేదమంత్రోచ్చారణల మధ్య హోమాలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనడానికి, రుగ్మతలు తొలగడానికి ఇలాంటి ఆధ్యాత్మిక యాగాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆనంద్‌కుమార్, నాయకులు భూపతిరెడ్డి, విజయ్‌కుమార్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి, జూలూరు రమేష్‌బాబు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.