25 July, 2026 | 12:31 PM

కడెం ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకం...!

25-07-2026 11:41 AM

నీటిమట్టం పడిపోవడంతో రైతుల్లో ఆందోళన

ప్రత్యామ్నాయ పంటల వైపు అధికారుల దృష్టి

జన్నారం, (విజయక్రాంతి): వర్షాభావ పరిస్థితులు కడెం ప్రాజెక్టు(Kaddam Project) ఆయకట్టు రైతుల పాలిట శాపంగా మారాయి. ఈ ఏడాది ప్రాజెక్ట్‌లో సరిపడా నీరు లేకపోవడంతో ఆయకట్టుకు సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది. వానకాలం సీజన్ ప్రారంభమైనా ప్రాజెక్టులో నీటిమట్టం నామమాత్రంగా ఉండటం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నీటిమట్టం దారుణంగా పడిపోయింది.

సాధారణంగా ప్రతి ఏటా వానకాలం సీజన్‌లో జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ రోజు నాటికి గత ఏడాది నీటిమట్టం 695 అడుగులు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 681 అడుగులు మాత్రమే. గత సంవత్సరంతో పోలిస్తే నీటిమట్టం గణనీయంగా తగ్గడంతో ఈసారి కాలువల ద్వారా నీటి విడుదల సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం

ప్రాజెక్ట్‌లో నీటి లభ్యత లేకపోవడాన్ని గుర్తించిన వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కీలక సూచనలు చేస్తున్నారు. ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల జోలికి వెళ్లకుండా, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరుతున్నారు. అధికారుల సూచనలతో ఆయకట్టు రైతులు సైతం పత్తి, జొన్న, మొక్కజొన్న, సజ్జ తదితర వర్షాధార పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.