10 July, 2026 | 5:03 PM

జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం: డీఈఓ వాసంతి

10-07-2026 04:06 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్, ఎయిడెడ్, కేంద్ర విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన ఉపాధ్యాయుల నుండి  జాతీయ ఉపాధ్యాయ అవార్డులు – 2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వాసంతి శుక్రవారం ఒక ప్రకటనలు తెలిపారు. ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశ్యం, విద్యా రంగంలో విశేష సేవలు అందించిన ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం. విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం, సృజనాత్మక బోధన పద్ధతులు అమలు చేయడం, సహ పాఠ్య కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించడం వంటి అంశాలను ఆధారంగా తీసుకొని ఎంపిక జరుగుతుందన్నారు.

కనీసం 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న రెగ్యులర్ ఉపాధ్యాయులు/ప్రధానోపాధ్యాయులు మాత్రమే అర్హులన్నారు. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ వెబ్ పోర్టల్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయన్నారు. అభ్యర్థులు తమ సేవలు, విజయాలు, కార్యాచరణలకు సంబంధించిన పోర్ట్‌ఫోలియో (డాక్యుమెంట్స్, ఫోటోలు, వీడియోలు) అప్లోడ్ చేయాలన్నారు. అభ్యర్థులు ఈనెల 13వ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలన్నారు. జిల్లాలోని అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఈ  అవకాశాన్ని  సద్వినియోగించుకోవాలని కోరారు.