10 July, 2026 | 5:11 PM

జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో వంద శాతం రాయితీ కల్పించాలి

10-07-2026 04:14 PM

- ఆర్టీసీ డిపోలో వినతి పత్రం సమర్పించిన టిడబ్ల్యూజేఎఫ్

చండ్రుగొండ,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సేవలందిస్తున్నామని, ఆర్టీసీ సంస్థకు కూడా తమ సేవలందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ చాలా ఏళ్ళుగా జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో 1/3 రాయితీ పై ప్రయాణ సదుపాయం అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే గత కొంతకాలంగా 1/3 చార్జీలు అంటూనే దాదాపు 50% చార్జీలు వసూలు చేస్తున్నారు. దీనివల్ల  జర్నలిస్టులకు భారమవుతుంది.

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులకు ఈ 1/3 చార్జీలు భరించలేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో అనేక మంది జర్నలిస్టులు సరైన వేతనాలు లేకపోయినప్పటికి జర్నలిజం వృత్తిలో కొనసాగుతూ ప్రభుత్వానికి, ప్రజలకు, ఆర్టీసీ సంస్థకు సేవలందిస్తున్నారు. అటువంటి జర్నలిస్టులు వార్తల సేకరణకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాల్సి రావడం వల్ల వారిపై ప్రయాణ చార్జీల భారం పడుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ మా కొద్దిమంది జర్నలిస్టులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించకపోవడం బాధాకరం.  జర్నలిస్టులకు అన్ని అర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని జిల్లా కో ఆర్డినేటర్ జి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. అనంతరం కొత్తగూడెం డిపో సూపర్డెంట్ ఏ రంజిత్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రామిశెట్టి సైదయ్య, ఫెడరేషన్ సభ్యులు నేరేళ్ళకుంట సుధాకర్, జక్కుల సంపత్,  జి నాగరాజు, షేక్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు.