24 April, 2026 | 1:29 PM

అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు

24-04-2026 11:59 AM

ఎలుగుబంటి దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు.. రెడ్డిపేట స్కూల్ తండాలో ఘటన

కామారెడ్డి, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): "కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటన రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్ తండాలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. తండా వాసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన సలావత్ మత్తు ప్రతిరోజూ మాదిరిగానే కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఎలుగుబంటి మత్తుపై దాడి చేసింది. తలను పట్టుకోవడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే అతని భార్య, అడవిలో బీడీ ఆకు కోసం వెళ్లిన మహిళలు గట్టిగా అరవడంతో ఎలుగుబంటి అక్కడినుంచి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన మత్తును కామారెడ్డి జీజీహెచ్ కు తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ జీజీహెచ్​కు తరలించారు." అయితే మత్తుపై దాడి చేసింది పులి అంటూ ప్రచారం జరిగింది. దాంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల మాచారెడ్డి మందళంలో పెద్దపులి సంచరిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుండడంతో పులి దాడి ఘటన నిజమేనని నమ్మారు. ఓసారి పెద్దపులి, మరోసారి చిరుత పులి అంటూ ప్రచారం సాగించారు. చివరికి తండా వాసులు దాడి చేసింది పులి కాదని, ఎలుగుబంటి అని చెప్పడంతో పులి దాడి ప్రచారానికి తెరపడింది.