జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి
కలెక్టర్ కె. హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 19 (విజయక్రాంతి): జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.జూన్ 12న ప్రారంభమయ్యే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలలు, ఆశ్రమాలు, గురుకులాల్లో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు వంటి మౌలిక వసతులు పూర్తి చేయాలని ఆదేశించారు.
పాఠశాలలు ప్రారంభమైన రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించాలని తెలిపారు.వర్షాకాలానికి ముందే భవనాలు, వంతెనలు, రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేయాలని, ప్రతి గ్రామానికి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షించాలని తెలిపారు.ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






