25 April, 2026 | 1:36 AM

అక్రమానికి అధికారుల అండ?

25-04-2026 12:13 AM
  1. నియమాలు బలహీనులకు.. సడలింపులు బలవంతులకు
  2. ముదురుతున్న ‘ది పెర్చ్’ కమర్షియల్ కాంప్లెక్స్ వివాదం
  3. కూల్చిన భవనానికి డోర్ నంబర్
  4. పర్మిషన్ రద్దుచేసినా మళ్లీ నిర్మాణం
  5. కోర్టు ఆదేశాలు పక్కనపెట్టి అక్రమానికి రెక్కలు
  6. హెచ్‌ఎండీఏ అక్రమమన్నా.. జీహెచ్‌ఎంసీ ఓకే చెప్పిందా?

సంగారెడ్డి, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ‘ది పెర్చ్’ కమర్షియల్ కాంప్లెక్స్ వ్యవహారం రోజురోజుకు తీవ్ర వివాదా స్పదంగా మారుతున్నది. సర్వే నంబర్ 407/ఏఏలో సుమారు 16,295 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో కొంత భాగాన్ని హెచ్‌ఎండీఏ ఇప్పటికే అక్రమంగా తేల్చినప్పటికీ, అదే నిర్మాణం మళ్లీ కొనసాగడం అధికారుల పనితీరుపై అనుమానాలను రేకెత్తిస్తున్నది.

లభ్యమైన సమాచారం ప్రకారం.. 2021లో ఇదే స్థలంలో రెసిడెన్షియల్ విల్లాల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ అనుమతి మంజూరు చేసింది. అయితే ఇందులో సుమారు 700 గజాల స్థలంలో కమర్షియల్ నిర్మాణాన్ని పూర్తిగా తిరస్కరించింది. అయినప్ప టికీ తప్పుడు పత్రాల ఆధారంగా 22 డిసెంబర్, 2021న తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి మేఘా మెడోస్ పేరుతో క్లియరెన్స్ పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి.

అనంతరం తిరస్కరించిన స్థలాన్ని కూడా కలుపుకొని ప్లాట్ నంబర్లు 1 నుంచి 5 వరకు సమీకరించి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రారంభించినట్టు తెలుస్తున్నది. ఈ అక్రమాలపై స్థానికులు అభ్యంతరం వ్యక్తంచేయడంతో విషయం కోర్టు దాకా వెళ్లింది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు అనుమతి రద్దుచేసి, నిర్మాణంలో ఉన్న భవనాన్ని గతంలో కూల్చివేశారు.

దీంతో కొంతకాలం నిర్మా ణ పనులు నిలిచిపోయాయి. అయితే కొద్ది నెలల తరువాత పరిస్థితులు మళ్లీ మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులు కొత్త ప్రణాళి కతో ముందుకు వచ్చి, అధికారులతో కుమ్మక్కై  తిరిగి ప్రారంభించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.

డోర్‌నంబర్ కేటాయింపులో జీహెచ్‌ఎంసీ అత్యుత్సాహం

ఇదే సమయంలో నిర్మాణం కొనసాగుతుండగానే జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ భవనానికి డోర్ నంబర్ కేటాయించడం వివాదానికి కేంద్రబిందువైంది. ఒకవైపు హెచ్‌ఎండీఏ అక్రమమని తేల్చిన నిర్మాణానికి, మరోవైపు జీహెచ్‌ఎంసీ అధికారిక గుర్తింపు ఇవ్వడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నది. రిజెక్ట్ చేసిన స్థలంతో నిర్మా ణం చేస్తే అనుమతులు ఎలా వస్తాయి? కూల్చిన భవనానికి డోర్ నంబర్ ఎలా ఇస్తారు? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఈ వ్యవహారంలో కొందరు అధికారులు అక్రమార్కులకు అండగా నిలుస్తూ, నియమ నిబంధనలను పక్కనబెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. ఒకే నిర్మాణంపై విభిన్న నిర్ణయాలు తీసుకోవడం వెనుక అసలు కారణాలేమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. నియమాలు బలహీనులకు, సడలింపులు బలవంతులకా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.