28 July, 2026 | 1:07 PM

Breaking News

తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు   •  

ప్రగతి బాటలో ‘ప్రమాద’ సంకేతాలు!

06-06-2026 01:30 AM

మొయినాబాద్లో అధికారుల నిర్లక్ష్యం.. 

రహదారి పక్కనే మృత్యుపాశంలా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్

మొయినాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతుందో మొయినాబాద్ మున్సిపాలిటీలోని 13వ వార్డును చూస్తే అర్థమవుతోంది. అధికారులు నిత్యం వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలను గుర్తిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ.. స్థానిక ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఒక భారీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వారి కంటికి కనిపించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

వార్డులోని ప్రధాన రహదారి పక్కనే ఎలాంటి రక్షణ కంచె (ఫెన్సింగ్) గానీ, కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు గానీ లేకుండా ఈ ట్రాన్స్ఫార్మర్ దర్శనమిస్తోంది. ఆ ప్రాంతంలో నిత్యం పశువులు సంచరిస్తుంటాయి. అదే మార్గంలో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు నిరంతరం రాకపోకలు సాగిస్తుండటంతో స్థానికులు గుండెచేత్తో పట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు.

ప్రమాదం జరిగితే బాధ్యులెవరు?

‘అభివృద్ధి, ప్రజా భద్రత అంటూ గొప్పలు చెప్పుకునే మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు ఇంతవరకు ఈ సమస్యను ఎందుకు పట్టించుకోలేదు? రేపు ఏదైనా ప్రాణనష్టం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు?‘ అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందస్తు చర్యలు తీసుకోవడం అధికారుల బాధ్యత కాదా అని క్షేత్రస్థాయికి వస్తున్న అధికారులను జనం నిలదీస్తున్నారు.

తక్షణమే చర్యలు చేపట్టాలి..

ఇప్పటికైనా మున్సిపల్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఆ ప్రమాదకర ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని, తగిన భద్రతా చర్యలు చేపట్టి తమ ప్రాణాలను కాపాడాలని 13వ వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.