1 May, 2026 | 2:49 AM

గ్రామీణ నిరుద్యోగులకు ‘ఐక్యత’ భరోసా

01-05-2026 12:07 AM

ఉచిత ఎస్త్స్ర, కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం

ఆమనగల్లు, ఏప్రిల్ 30(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంత యువతలోని ప్రతిభకు పదునుపెట్టి, వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా ఐక్యత ఫౌండేషన్ ముందడుగు వేసింది. ఫౌండేషన్ చైర్మన్ మరియు టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గురువారం ఆమనగల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉచిత ఎస్త్స్ర, కానిస్టేబుల్ శిక్షణ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాలకు మాత్రమే పరిమితమైన ఖరీదైన కోచింగ్ను గ్రామీణ యువతకు చేరువ చేయాలనే సంకల్పంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్థిక స్థోమత లేక ఎంతోమంది యువకుల కలలు అర్ధాంతరంగా ఆగిపోకూడదనే ఉద్దేశంతో, ప్రతి మండల కేంద్రంలోనూ ఇలాంటి ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కేవలం పాఠ్యాంశాలే కాకుండా.. అభ్యర్థులకు అవసరమైన దేహదారుఢ్యం, క్రమశిక్షణ, మరియు మానసిక ధైర్యం పెంపొందించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు.

వందలాది రూపాయల ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థులకు ఇదొక గొప్ప అవకాశమని, దీనినిసద్వినియోగం చేసుకుని తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఎస్‌ఐ సీతారాం రెడ్డి, సర్పంచ్ కళ్యాణ్, మాజీ ఎంపిటిసి పంతు నాయక్, రచ్చ శ్రీరాములు, పలువురు ఉపాధ్యాయులు, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.