తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్‌టీఆర్: తుమ్మల
ఖమ్మం, మే 31 (విజయక్రాంతి): తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత నందమూరి తారక రామారావు అని, ఆయన చూపిన సేవా స్ఫూర్తితో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయ మని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఖమ్మంలోని స్వర్ణభారతి కమ్మవారి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదని, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత అని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన అమలు చేసిన పథకాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని, సామాజిక బాధ్యతతో కమ్మ మహాజన సంఘం చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజానికి మరింత మేలు చేకూరుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ మేయర్ నీరజ, తుమ్మల యుగంధర్ కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు కొల్లు రఘు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చావా రాము, ఉపాధ్యక్షురాలు కర్నాటి రమాదేవి, సహాయ కార్యదర్శి వజ్జా శ్రీనివాసరావు, కోశాధికారి తుళ్లూరి నిర్మలకుమారి, కార్యవర్గ సభ్యులు మోతుకూరి సత్యనారాయణ, నల్లమల ఆనంద్, మేదరమెట్ల స్వరూపరాణి, డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు, తుమ్మలపల్లి నాగేశ్వరరావు, కోలేటి నవీన్, నంబూరి ప్రసాద్, తాళ్లూరి మురళీకృష్ణ, బండి రవికుమార్, బతినేని ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.






