21 March, 2026 | 4:22 AM

చేవెళ్లలో ఇక ‘మేకల’ సందడి

21-03-2026 12:55 AM

ఎమ్మెల్యే కాలె యాదయ్య చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్

చేవెళ్ల, మార్చి 20 (విజయ క్రాంతి): చేవెళ్ల ప్రజల ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడింది. ఇకపై గొర్రెలు, మేకల విక్రయాల కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సిన అవసరం లేదు. చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘మేకల అంగడి‘ని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ ప్రాంత రైతులు, వ్యాపారులు మేకలను కొనాలన్నా, అమ్మాలన్నా హైదరాబాద్, వికారాబాద్, మోమిన్పేట వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. సుమారు 30 నుంచి 50 కిలోమీటర్ల ప్రయాణం అంటే మాటలు కాదు.

ప్రజల కష్టాలను గుర్తించి, వారి సౌకర్యార్థం నూతన మార్కెట్ కమిటీతో కలిసి ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నాం‘ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులకు, మాంసం వ్యాపారులకు, అలాగే శుభకార్యాల కోసం మేకలు కొనే సామాన్య ప్రజలకు ఇది అద్భుత అవకాశం. మార్కెట్ కమిటీ సభ్యులు వారం రోజుల పాటు వివిధ ప్రాంతాల్లోని సంతలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పక్కా ప్లానింగ్తో చేవెళ్లలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ బేగరి రాములు, మున్సిపల్ చైర్మన్ దేవర సమతా వెంకట్ రెడ్డితో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొని సందడి చేశారు.