త్వరలోనే 15 వేల అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్
- ఉపాధిహామీ చట్టాన్ని కేంద్రం నిర్వీర్యం
- బీజేపీ అష్టదిగ్బంధపాలకులు నిధులు తేవాలి
- వాకౌట్ పేరుతో బీఆర్‌ఎస్ డ్రామాలు
- మంత్రి సీతక్క
హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): త్వరలోనే 15 వేల అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్ వేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. పల్లెల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని, పనిదినాలను కుదించిందన్నారు. అసెంబ్లీలో ఎనిమిది మంది బీజేపీ అష్టదిగ్బంధ పాలకులున్నారని, ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కేంద్రంతో మాట్లాడి తెలంగాణకు నిధులు తేవాలన్నారు.
శనివారం అసెంబ్లీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమం పద్దులపై సీతక్క మాట్లాడారు. సభ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్ చేయడంపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేస్తూ పదేళ్లపాటు గ్రామాల అభివృద్ధి చేయలేదన్నారు. ఆత్మీయ భరోసాను అర్హులైన వారికి అందిస్తున్నామన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమకు లెటర్ ఇవ్వాలని, గ్రామాల అభివృద్ధికి ఎన్ని నిధులు ఖర్చు చేశామోనని కావాలంటే తనపై విచారణ కోరవచ్చన్నారు.
వాకౌట్ పేరుతో బీఆర్‌ఎస్ డ్రామాలు ఆడుతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అసత్యాలు మాట్లాడారని, ఆరోపణలు చేసి వాకౌట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. భారతదేశపు ఆత్మ గ్రామాల్లోనే ఉందని మహాత్మా గాంధీ మాటలే తమకు ఆదర్శమన్నారు. పంచాయతీల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించి పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచిన చరిత కాంగ్రెస్‌దేనన్నారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళల సాధికారతకు పెద్ద పీట వేస్తున్నామని, రూ.57 వేల కోట్లు మహిళా సంఘాలకు ఇచ్చినట్లు తెలిపారు.
నేను నిత్య విద్యార్థిని...
తాను నిత్య విద్యార్థిని అని మంత్రి సీతక్క తెలిపారు. ఎప్పుడూ తాను భయం, భద్రత, బాధ్యతతో పనిచేస్తానన్నారు. తాను ఉద్యమం నుంచి వెళ్లొచ్చిన తర్వాత ఉన్నత విద్యను అభ్యసించానని, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం చేసి నల్ల కోటు వేసుకొని కోర్టుకు వెళ్లానని, పీహెచ్‌డీ కూడా పూర్తి చేశాన్నారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.
త్వరలోనే మహిళా ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి మహిళల కోసం ఓ పాలసీని తీసుకొస్తామన్నారు. మహిళలను గౌరవించేలా పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాలు పెట్టాలని, మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఎలాంటి శిక్ష పడుతుందో అందులో చెప్పాలని, అప్పుడే భయపడతారని తెలిపారు. మహిళల గౌరవం కోసం రాష్ట్ర వ్యాప్తంగా బాలింతల కోసం ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.




