ప్రభుత్వ పరిశీలనలో ఆర్టీసీ విలీనం
- పదేళ్లలో రూ.7వేల కోట్లు కూడా ఇవ్వలేదు
- మేము రెండేళ్లలో రూ.7800 కోట్లు చెల్లించాం
- మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): ప్రభుత్వ పరిశీలనలో ఆర్టీసీ విలీనం అంశం ఉందని, అది కమిటీ వద్ద ఉందని, గుర్తింపు సంఘాల అంశం కోర్టు పరిధిలో ఉందని రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే గుర్తింపు సంఘాలుండవని, యూనియన్లు ఉంటాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీని ముసేస్తామని నిర్వీర్యం చేసే కుట్ర చేసిందని, కార్మికులు సమ్మె చేసినా వారిని పట్టించుకోలేదని, పైగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పారన్నారు.
ప్రజా పాలన ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను అక్కున చేర్చుకుందని, వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వం సంవత్సరానికి రూ.1500 కోట్లు ప్రకటించి 10 ఏళ్లలో రూ.7 వేల కోట్లు కూడా ఇవ్వలేదని, తాము రెండు సంవత్సరాల్లోనే ఆర్టీసీకి రూ.7800 కోట్లు చెల్లించామన్నారు. శనివారం పద్దులపై జరిగిన చర్చలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ బస్సులు నడుపుతున్నామని, వచ్చే రెండు సంవత్సరాల్లో 2800 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని పేర్కొన్నారు.
అయితే తాము హైర్ బస్సుల సంఖ్యను పెంచడంలేదన్నారు. బస్సుల సంఖ్య, రూట్ల సంఖ్యను పెంచుతున్నామన్నారు. పేద వర్గాలకు ఆర్టీసీ లైఫ్ లైన్ అని, మినీ బస్సులను కూడా నడుపుతామన్నారు.చెక్ పోస్టులను రద్దుచేసి పారదర్శక సేవలను అందజేస్తున్నామని, పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం సబ్సిడీతో ఈవి వాహనాలను అందజేస్తున్నామని చెప్పారు. విద్యకి ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నామని, గురుకులాలల్లో జేఈఈ, నీట్, ఎప్‌సెట్ కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. బీసీ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, శాంతిభద్రతల విషయంలో పోలీసులు అందిస్తున్న సేవలు అభినందించదగ్గవని, సభలో పోలీసు అధికారులపై వ్యక్తిగత విమర్శలకు తావులేదని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి కౌంటరిచ్చారు.
ప్రజాప్రతినిధులతో భేటీ..
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటంతో నియోజకవర్గాల వారీగా కావాల్సిన మౌలికసదుపాయాలు, కొత్త బస్సులు, స్టేషన్ల అభివృద్ధి, కొత్త రూట్లు అంశాలపై మంత్రి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మూడోరోజైన శనివారం అసెంబ్లీ కమిటీ హాల్ ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల ప్రజాప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలడిగి తెలుసుకున్నారు.




