30 March, 2026 | 2:36 AM

నో కింగ్స్

30-03-2026 12:54 AM
  1. అమెరికా, యూరప్‌లో ఉధృతంగా ఉద్యమం
  2. ఇరాన్‌పై యుద్ధానికి, ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు
  3. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, చికాగో వరకు 3,100కు పైగా ప్రదర్శనలు

వాషింగ్టన్, మార్చి 29 : ఇరాన్‌పై యుద్ధానికి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా శనివారం అమెరికా, యూరప్‌లో ‘నో కింగ్స్‘ ర్యాలీలను భారీస్థాయిలో నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు, ఆందోళనకారులు తరలొచ్చి ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినదించారు. ట్రంప్ దూకుడుతనానికి, వలసల అమలును నిరసిస్తూ లక్షలాది మంది ప్రజలు ఐక్యంగా తరలిరావడానికి సెయింట్ పాల్ (మిన్నెసోటా) ప్రధాన వేదికగా నిలిచింది.

ఇప్పటికే రేటింగ్ పడిపోయిన ట్రంప్‌నకు ఇది అతిపెద్ద షాక్. శనివారం మార్చి 28న ట్రంప్ వ్యతిరేక ‘నో కింగ్స్’ ఉద్యమం ఆదివారం ఉద్ధృతంగా మారింది. వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, చికాగో వరకు దేశవ్యాప్తంగా 3,100కు పైగా ప్రదర్శనలు నిర్వహించారు. ఇందులో ఆర్గనైజర్లు మిలియన్ల మంది పాల్గొన్నట్లు చెప్పారు. ఇది ట్రంప్ అధికారంలోకి వచ్చాక మూడోసారి జరిగిన ‘నో కింగ్స్’ నిరసనలలో అతిపెద్దది.

ఫిబ్రవరి 2026లో ఇజ్రాయెల్-అమెరికా కూటమి ఇరాన్‌పై దాడులు చేసి సుప్రీం లీడర్ అలీ ఖామెనీని హతం చేయడంతో మొదలైన యుద్ధం ఇప్పుడు అమెరికా లోపలే తీవ్ర వ్యతిరేకతను రగిల్చేసింది. యుద్ధం మొదలై నెల రోజులు అవ్వడంతో ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది అమెరికా కోసం కాదనీ.. ఇజ్రాయెల్ కోసం అమెరికా యుద్ధం అని విమర్శిస్తున్నారు. ఒక నిరసనకారుడు అమెరికా తన కుమారులు, కుమార్తెలను ఇజ్రాయెల్ కోసం యుద్ధానికి పంపడం ‘మేము కోరుకోము!’ అని ఆగ్రహించారు. ఇది దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిం చింది. అయితే వైట్ హౌస్ ప్రతినిధి అబిగైల్ జాక్సన్, వీటిని ‘వామపక్ష నిధుల నెట్‌వర్క్’ ఫలితంగా అభివర్ణించారు. వీటికి ప్రజల నుంచి నిజమైన మద్దతు చాలా తక్కువని స్పష్టం చేశారు.