27 August, 2026 | 11:33 AM

ఓటర్ల జాబితా పారదర్శకతే లక్ష్యంగా పనిచేయాలి

27-08-2026 10:47 AM

రామగుండంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

రామగుండం, ఆగస్టు27 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో ఓటర్ల హక్కుల పరిరక్షణ అత్యంత కీలకమని, ఓటరు జాబితా పారదర్శకంగా ఉండేలా పోలింగ్ కేంద్ర స్థాయి ప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు(Congress State General Secretary Duddilla Srinu Babu) స్పష్టం చేశారు. రామగుండం నియోజకవర్గంలోని శుభం వేడుకల ప్రాంగణంలో స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సులో శ్రీను బాబు ముఖ్య వక్తగా పాల్గొని పార్టీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఓటర్ల జాబితా రెండో దశ సవరణ ప్రక్రియపై ఆయన స్వయంగా పెద్ద తెరపై దృశ్యరూపంలో సమగ్ర సమాచారాన్ని అందించారు. క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన రెండో దశ సవరణ విధివిధానాలు, ఓటర్ల జాబితాలో తప్పుల సరిదిద్దడం, చిరునామా మార్పులు మరియు కొత్త ఓటర్ల చేర్పులను పక్కాగా గుర్తించే పద్ధతులను ప్రత్యక్షంగా వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించబడకుండా చూడాల్సిన ప్రాథమిక బాధ్యత పార్టీ క్షేత్రస్థాయి ప్రతినిధులపైనే ఉందని పేర్కొన్నారు.

కార్యకర్తలకు మార్గదర్శనం

ప్రతి పరిధిలో ఓటర్ల వివరాల పరిశీలన పకడ్బందీగా పూర్తి చేసి, అర్హులందరికీ ఓటు హక్కు దక్కేలా కార్యాచరణను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ పోలింగ్ కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. దుద్దిళ్ల శ్రీను బాబు అందించిన వివరణ తమకు ఎంతగానో ఉపకరించిందని నాయకులు తెలిపారు.