27 August, 2026 | 11:28 AM

చిలకలూరిపేట రోడ్డుప్రమాదంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి

27-08-2026 10:35 AM

చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట(Chilakaluripet Road Accident) సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) పట్ల ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు(N. Chandrababu Naidu) తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటో-రిక్షాను ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మరణించడం, పలువురు గాయపడటం పట్ల సీబీఎన్ విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వారికి చికిత్స అందుతోంది. బాధిత కుటుంబాలకు CBN తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే, గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించాలని అధికారులకు సూచించారు.