ధాన్యం దిగుమతిలో జాప్యం వద్దు
25-05-2026 05:02 PM
జిల్లా కలెక్టర్ కె. హరిత
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): యాసంగి సీజన్‌లో కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లర్లు జాప్యం చేయకుండా వెనువెంటనే దిగుమతి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు.సోమవారం కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్లు, వాహనాల కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించి, దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. హమాలీలు, వాహనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, గోనె సంచులు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.






