1 May, 2026 | 1:29 AM

ఉపాధి కూలీల బతుకు ఛిద్రం!

01-05-2026 12:03 AM

సాంకేతికత పేరిట కూలీల పొట్ట కొడుతున్న కొత్త నిబంధనలు

ఇబ్బందులు పడుతున్న కూలీలు 

రంగారెడ్డి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ఒకవైపు ఆకాశం నుండి నిప్పులు చెరుగుతున్న భానుడు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన సాఫ్ట్వేర్ నిబంధనలు...ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నారు ఉపాధి హామీ కూలీలు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో అమల్లోకి వచ్చిన వీబీ జీ రాష్ట్రీ (VBGR) సాఫ్ట్వేర్ అప్డేట్, ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) విధానం కూలీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త ఫేస్ రికగ్నిషన్ యాప్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో విఫలమవుతోంది.

గతంలో ఉన్న మస్టర్ సంతకాలు, వేలిముద్రల స్థానంలో వచ్చిన ఈ సాంకేతికత వృద్ధ కూలీలకు శాపంగా మారింది. ముఖం మారితే ముద్దు కరువే అన్నట్టు ఉంది. క్షేత్రస్థాయిలోని పరిస్థితి. వయసు రీత్యా ముఖంపై వచ్చే ముడతలు, కంటి చూపులో మార్పులను సాఫ్ట్వేర్ రీడ్ చేయలేకపోతోంది.  పురుషులు గడ్డం పెంచినా, గుండు చేయించుకున్నా, మహిళలు కొత్తగా ముక్కుపుడకలు ధరించినా యాప్ వారిని గుర్తించడం లేదు. దీనివల్ల రోజంతా కష్టపడి పని చేసినా, ’హాజరు’ నమోదు కాకపోవడంతో వేతనం గల్లంతవుతోంది.

సెల్ఫీ కోసం ఎండలో పడిగాపులు..

రంగారెడ్డి జిల్లాలోనిఇబ్రహీంపట్నం, షాద్నగర్, ఆమనగల్ వంటి ప్రాంతాల్లో ఎండలు 44ఓC కి చేరుకున్నాయి.పని ప్రదేశంలోనే ఫోటో దిగాలనే నిబంధన ఉండటంతో, సిగ్నల్ దొరకని చోట్ల కూలీలు గంటల తరబడిఎండలోనే నిలబడాల్సి వస్తోంది. పని స్థలాల్లో కనీసం నీడ కోసం టెంట్లు కానీ, చల్లని తాగునీరు కానీలేకపోవడంతో వడదెబ్బ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

బడ్జెట్ జాప్యం..

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో స్పష్టత లేకపోవడం మరో ప్రధాన అడ్డంకిగా మారింది. మెటీరియల్ కాంపోనెంట్ నిధులు పెండింగ్లో ఉండటంతో కొత్త పనులకు అనుమతులు రావడం లేదు. పని చేసిన వారికి కూడా 3 నుండి వారాల వరకు వేతనాలు అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా లో ఉపాధిహామీ మొత్తం కూలీల సంఖ్య సుమారు 2.5 లక్షల మంది ఉండగా,సాంకేతిక సమస్యలతో నష్టపోతున్న వారు ప్రతి రోజు 15% - 20% మంది ఉన్నారు. వీరందరికీ వేతన బకాయిల కాలం 3 నుండి 5 వారాలు ఆలస్యం అవుతుంది.

సాప్ట్ వేర్ ఇబ్బందులు లేకుండా చూడాలి..

సాఫ్ట్వేర్ లోపాలను వెంటనే సరిదిద్ది, పాత పద్ధతిలో లేదా బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోవాలని, కూలీలు తమ సమస్యలనుమోరపెట్టుకుంటున్నారు.ఎండ తీవ్రత దృష్ట్యా పని వేళలను ఉదయం 6 నుండి 11 గంటల వరకే పరిమితం చేయాలని,పని ప్రదేశాల్లో తక్షణమే మెడికల్ కిట్లు, తాగునీరు, నీడ వసతి కల్పించాలి.సాంకేతికత సౌలభ్యం కోసం ఉండాలి కానీ, పేదల పొట్ట కొట్టడానికి కాదని క్షేత్రస్థాయి కూలీలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ ‘సాఫ్ట్వేర్ మంట‘ నుండి కూలీలను కాపాడాలని కోరుతున్నారు.కూలి పనులకు వెళ్తేనే పూట గడిచే మాకు, ఈ మొఖం చూసే మిషన్లు (యాప్స్) అర్థం కావడం లేదు. ఫోటో పడకపోతే ఆ రోజు కూలి రాదు. ఎండలో నిలబడి ప్రాణాలు పోయేలా ఉందని  కడ్తాల మండలం కు చెందిన కూలీ లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.