గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి
నూతన గ్రామపంచాయతీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో నూతన గ్రామపంచాయతీల ఏర్పాటు జరిగిన నేపథ్యంలో నాగిరెడ్డిపేట మండలంలోనీ మెల్లకుంట తండా గ్రామంలో గ్రామపంచాయతీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని మెల్లకుంట తండాను నూతన గ్రామపంచాయతీగా ఆవిర్భవించిన సందర్భంగా గ్రామపంచాయతీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రతి సమస్యపై అవగాహన కలిగి గ్రామాభివృద్ధికి కృషి చేసిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడం ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పునాది పడిందని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దాదాపు 80 తండాలు గ్రామపంచాయతీలుగా మారాయని తెలిపారు. నాగిరెడ్డిపేట మండలంలో అనేక తండాలు గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డాయని చెప్పారు."ప్రతి తాండా కూడా నా తాండానే” అనే భావంతో ఎటువంటి రాజకీయ భేదాభిప్రాయాలు లేకుండా పనిచేశానని పేర్కొన్నారు.
గతం ప్రభుత్వంలో సర్పంచ్‌లను పార్టీ మారమని ఎవరిని ఒత్తిడి చేయలేదని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు సర్పంచులు పార్టీలు మారాలని ఒత్తిడులు పెడుతున్నారని ఆరోపించారు. మెల్లకుంట తండా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే ఉంటే, నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ ఏడాది నిధులు ఆపగలరేమో కానీ వచ్చే కాలంలో మళ్లీ మాప్రభుత్వమే వస్తుందని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ కింద భారీ నిధులు విడుదలయ్యాయని, గ్రామాలకు రోడ్లు,ట్రాక్టర్లు వంటి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. చిన్న పనులకు కూడా శిలాఫలకాలు వేయించే సంప్రదాయం పాటించలేదని, ప్రజలకు ఉపయోగపడే పనులకే ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.
ఒక సర్పంచ్‌కు ఐదు లక్షల పని ఇస్తే, శిలాఫలకాల పేరుతో డబ్బులు ఖర్చు చేయించలేదని అన్నారు. తాను జిల్లాలో అత్యధిక నిధులు తీసుకువచ్చిన వ్యక్తినని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తెలిపారు. ప్రతి తాండాకు రోడ్లు వేసి, గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు అందించామని తెలిపారు. సర్పంచ్‌లతో సన్నిహితంగా పనిచేసినట్లు గుర్తుచేశారు. ప్రస్తుత ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తూ, రెండు సంవత్సరాలుగా ఎలాంటి నిధులు తీసుకురాలేదని, నిజంగా నిధులు తెచ్చి ఉంటే జీఓ కాపీలు చూపించాలని సవాలు చేశారు. ఎల్లారెడ్డి ఎన్నికల్లో ఖర్చుల పేరుతో తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని, రాజకీయాల కోసం కాదు ప్రజల కోసం పనిచేయాలని సూచించారు.
గతంలో చెరువులు, బ్రిడ్జిలు నిర్మించామని,గ్రామ అభివృద్ధికి కృషి చేశామని చెప్పారు. రైతుబంధు, పింఛన్లు, రుణమాఫీ వంటి హామీలు అమలు కాలేదని, ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పింఛన్లు పెంచుతామని చెప్పి అమలు చేయలేదని అన్నారు.గిరిజన గురుకులాల పరిస్థితి దయనీయంగా ఉందని, భవనాలు లేకుండా కిరాయి ఇళ్లలో నడుస్తున్నాయని తెలిపారు. గిరిజన విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. యూరియా గతంలో ఎక్కడైనా అందుబాటులో ఉండేదని, ఇప్పుడు యాప్‌లపై ఆధారపడే పరిస్థితి వచ్చిందని అన్నారు. పేద రైతులకు ఇది కష్టంగా మారిందని పేర్కొన్నారు. రుణమాఫీ పూర్తిగా జరగలేదని, అయినప్పటికీ జరిగిందని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు.






