ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
- విద్యార్థుల సర్వాంగీణ వికాసానికి క్రీడలు ఎంతో కీలకం
- కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్,(విజయక్రాంతి): విద్యార్థుల సర్వాంగీణ వికాసానికి విద్యతో పాటు క్రీడలు ఎంతో కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని TGTWURJC గురుకుల కళాశాలలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటి నీరు పోశారు. అనంతరం హాకీ దిగ్గజం, భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయ క్రీడాకారుడైన మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని అన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించడం, క్రమశిక్షణతో ముందుకు సాగడం, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించడం వంటి విలువలను క్రీడలు నేర్పుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకుని, అందుబాటులో ఉన్న క్రీడా వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రతిభ కలిగిన విద్యార్థులు నిరంతర సాధనతో తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు గురుకుల విద్యాసంస్థల్లో క్రీడలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ ప్యానెల్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. అనంతరం విద్యార్థులకు నూతన పాఠశాల యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అనిల్, వైస్ ప్రిన్సిపాల్ యోగేష్ దీక్షిత్, అధ్యాపకులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






