29 August, 2026 | 8:14 PM

సెప్టెంబర్ 3న గైనకాలజీ స్పెషలిస్ట్ వైద్యుల ఎంపికకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ

29-08-2026 07:14 PM

ఖమ్మం, ఆగస్టు -29(విజయక్రాంతి): తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని మధిర ఏరియా ఆసుపత్రిలో ప్రజలకు గైనకాలజీ వైద్య సేవలు రెండు నెలల కాలానికి (జాయిన్ అయిన తేదీ నుండి) తాత్కాలిక ప్రాతిపదికన  అందించేందుకు సెప్టెంబర్ 3న ఉదయం 11 గంటలకు వాక్-ఇన్- ఇంటర్వ్యూ ద్వారా గైనకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ ఒకరిని ఎంపిక చేయనున్నట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్‌ఎస్) డాక్టర్ కె. రాజశేఖర్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఎంపికైన వైద్యునికి నెలకు లక్ష రూపాయల గౌరవ వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఎంబీబీఎస్‌తో పాటు ఎంఎస్ (OB & GY) ఉత్తీర్ణులై ఉండాలని, సంబంధిత విభాగంలో అదనపు అర్హతలు, సాధారణ పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులు లేదా ఇతర ప్రభుత్వ వైద్య సంస్థల్లో గైనకాలజీ విభాగంలో పనిచేసిన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఈ నియామకాలు రెగ్యులర్, కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీ కాదని, ప్రజల అత్యవసర వైద్య అవసరాల దృష్ట్యా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో కేవలం రెండు నెలల కాలానికి మాత్రమే తాత్కాలిక సేవల కోసం చేపడుతున్న చర్య అని స్పష్టం చేశారు. వాక్-ఇన్- ఇంటర్వ్యూ సెప్టెంబర్ 3న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ ఖమ్మం లోని జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయం, మొదటి అంతస్తు, రూమ్ నంబర్ F-2లోని సూపరింటెండెంట్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

అర్హులైన అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, గత ప్రభుత్వ సేవల అనుభవ ధృవపత్రాలు, రెండు సెట్ల అటెస్టెడ్ జిరాక్స్ ప్రతులు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో నిర్ణీత తేదీ, సమయానికి నేరుగా వాక్-ఇన్- ఇంటర్వ్యూ కు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలు, దరఖాస్తు నమూనా కోసం ఖమ్మం జిల్లా అధికారిక వెబ్సైటు https://khammam.telangana.gov.in ను సందర్శించాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ఆ ప్రకటనలో తెలిపారు.