చెల్పూర్ ఎంజీఎం పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
గణపురం,(విజయక్రాంతి): చెల్పూర్ ఎంజీఎం పాఠశాలలో శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 29ను జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం క్రీడాజ్యోతిని వెలిగించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, బ్యాడ్మింటన్ తదితర క్రీడా పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
పాఠశాల కరెస్పాండెంట్ గ్యాదంగి సతీష్ మాట్లాడుతూ క్రికెట్‌కు అంతగా ప్రాధాన్యం లేని రోజుల్లో హాకీ ద్వారా భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ అని కొనియాడారు. ఒలింపిక్స్‌లో భారతదేశానికి మూడు బంగారు పతకాలు సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. భారతదేశం 2036 ఒలింపిక్స్ నిర్వహించాలనే లక్ష్యానికి మద్దతుగా విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడమే తమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించి, వారి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంలో పాఠశాల కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి, గ్యాదంగి రమాదేవి, సిల్వేరి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ మధుకర్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.






