శ్రీ చైతన్య స్కూల్ లో ఘనంగా నేషనల్ సైన్స్ డే
మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పీర్జాది గూడలో శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌లో "జాతీయ విజ్ఞాన దినోత్సవం" సైన్స్ డే వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆర్ వి ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి, 5వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బోడిగె స్వాతి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పర్యావరణ పరిరక్షణ, సౌరశక్తి అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన వివిధ వైజ్ఞానిక నమూనాలను తయారుచేసి, విద్యార్థులు తమ ప్రాజెక్టుల గురించి వివరించారు. అనంతరం తుంగతుర్తి రవి మాట్లాడుతూ... నేటి పోటీ ప్రపంచంలో శ్రీ చైతన్య విద్యాసంస్థలు విద్యార్థులను కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం చేయకుండా వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంలో ముందంజలో ఉన్నాయి. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ, వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న తీరు అభినందనీయం.
ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడంలో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి ప్రోత్సాహం వల్లనే మన విద్యార్థులు గ్లోబల్ స్థాయిలో రాణించగలరు. సర్ సి.వి. రామన్ స్ఫూర్తితో ప్రతి విద్యార్థి ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శంభోజు రమేష్ బాబు , ఛైర్పర్సన్ శంభోజు శ్రీలత , అకాడమిక్ ఇంచార్జి విశాల్, డాక్టర్ రిషి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉదయ రాణి, ప్రొఫెసర్ డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




