4 May, 2026 | 2:44 AM

సమయస్ఫూర్తి చాటుకున్న నాగోల్ పోలీసులు

04-05-2026 01:20 AM

పరీక్షా కేంద్రం తారుమారుతో నాగోల్‌కు వచ్చిన విద్యార్థిని - నిమిషాల వ్యవధిలోనే  గమ్యానికి చేర్చిన పోలీసులు

ఎల్బీనగర్, మే 3 : నీట్ పరీక్ష కేంద్రం గుర్తించడంలో పొరపాటు పడిన ఒక విద్యార్థిని.. నాగోల్ పోలీసులు సకాలంలో స్పందించి పరీక్ష కేంద్రానికి చేర్చి, పరీక్ష రాయించారు. సమయస్ఫూర్తితో స్పందించి ఒక విద్యార్థిని భవిష్యత్తును కాపాడిన ఘటన నాగోల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బైరామలగూడలోని అడ్వాన్స్ బ్లాక్ బోర్డుఅకాడమీ కోచింగ్ సెంటర్లో ఎస్.నం దిని నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నది.

అయితే, కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన వాహనంలో వెళ్లాల్సిన విద్యార్ధిని పొరపాటున ఎల్బీనగర్ రూట్ వాహనంలో ఎక్కి నాగోల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రం వద్ద దిగింది. అయితే కొద్ది సేపటికే అది తాను రాయాల్సిన అసలు కేంద్రం కాదని గుర్తించి తీవ్ర ఆందోళనకు గురైంది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న నాగోల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఆమె పరిస్థితిని గమనించి విద్యార్థినిని వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్‌తో సమన్వయం చేసి అసలు పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

పోలీస్ వాహనంలో సరైన సమాయానికి వనస్థలిపురం రైతు బజార్ సమీపంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న అసలు పరీక్ష కేంద్రానికి సురక్షి తంగా చేర్చారు. పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకోలేనేమో అన్న భయంతో ఉన్న నందినికి ఇది పెద్ద ఊరటనిచ్చింది.