7 March, 2026 | 1:02 PM

మూసీ పునరుద్ధరణ ఆపాలి!

06-03-2026 12:00 AM

మూసీ నది, దాని ఒడ్డుకు సమీపంలో నివసించే ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న ప్రజల ఉద్యమం ‘మూసీ జన్ ఆందోళన్ ’(ఎంజేఏ). తాజాగా ఎంజేఏ ప్రతినిధుల బృం దం ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఒక లేఖ రాసింది.

ఈ సందర్భంగా లేఖలోని అంశాలను పత్రికా ముఖంగా అందరితో పంచుకుంది. ప్రతిపాదిత మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగమైన ‘గాంధీ సరోవర్ ప్రాజెక్ట్’ గురించి మేము తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాము. సివిల్ సొసైటీ కార్యకర్తలు, పర్యావరణవాదులు, మానవ హక్కుల సంస్థలు, స్థానిక నివాసితులతో కూడిన ఈ నెట్‌వర్క్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాన్ని వెంటనే ఆపాలని, ప్రజాస్వామ్య చర్చల ద్వారా పూర్తి సమీక్ష చేయాలి. ఈ విషయమై తక్షణమే మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నాము. 

ప్రధాన అంశాలు..

రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలం, బండ్లగూడ జాగీర్ గ్రామంలో 10.34 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఇది తక్షణమే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్స్ నివాసులను ప్రభా వితం చేస్తోంది. అదనంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్ కోసం 98.20 ఎకరాల రక్షణ శాఖ భూమిని బదిలీ చేయమని కోరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 12, 2026న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను శంకుస్థాపన వేడుకకు ఆహ్వానించారు.

ప్రజల వ్యతిరేకతను, ప్రజాస్వామ్య ప్రక్రియలను పట్టించుకోకుండా ఇలా చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ ప్రజల వైపు నుంచి ఎన్నో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. మహాత్మా గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ కూడా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ‘నివాసులను తొలగించి గాంధీ విగ్రహానికి స్థలం కోసం చేసే ఈ ప్రయత్నం ఏమాత్రం గాంధేయ విలువల పట్ల గౌరవం ఉన్న చర్య కాదు.

తెలంగాణ ముఖ్యమంత్రికి ఇదే నా విజ్ఞప్తి. దయచేసి దీన్ని చేయవద్దు. బాపూజీ బతికి వుంటే ‘నా పేరుతో కాదు, ఆపేయండి!’ అని అనేవారని పేర్కొన్నారు. 2013 ఆర్‌ఎఫ్‌సీటీఎల్‌ఏఆర్‌ఆర్ చట్టం కింద సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నుంచి ఈ ప్రాజెక్ట్‌కు మినహాయింపు ఇవ్వడాన్ని ఎంజేఏ ఖండిస్తోంది. 2017లో రాష్ట్ర సవరణ ద్వారా ఈ చట్ట ఉద్దేశాన్ని, ప్రజల ప్రయోజనాలను, ఆహార భద్రతను దెబ్బతీస్తున్నారని మరొక్కసారి చెబుతున్నాం. ప్రస్తుత విధానం నది పర్యావరణ వ్యవస్థకు, ప్రభావిత సమాజాలకు, తెలంగాణ ప్రజలందరికీ హానికరమైన, శాశ్వత పరిణామాలను తెస్తుందని ఎంజేఏ తరఫున హెచ్చరిస్తున్నాము.

ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత రూపంలో కొనసాగితే ప్రజల స్పందనలను పట్టించుకోకుండా మన సహజ వారసత్వానికి తిరిగి రాని నష్టం కలిగిస్తుందని గుర్తించాలి. స్థానిక ప్రజల్లో ఉన్న ఈ అసంతృప్తిని రాష్ట్ర ప్రభుత్వానికి, జాతీయ కాంగ్రెస్ నాయకత్వానికి తెలియజేయాలని మీనాక్షి నటరాజన్‌ను ఎంజేఏ కోరుతున్నది. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ప్రారంభం కాకుండా చూడాలని, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను పూర్తిగా, ప్రజలతో కలిసి సమీక్షించేలా చేయాలని కోరుతున్నాము.

అఖిల్ సూర్య, జీవన్ కుమార్, జాన్ మైకెల్, కమల్ నాయుడు, మీరా సంగమిత్ర, రుచిత్ ఆశా కమల్, సజయ కాకర్ల, సంధ్య, సయ్యద్ బిలాల్, వర్గీస్ తెక్‌నాథ్, వైశాలీ నాయుడు, ఆనంద్ తంగెళ్ల.

(మూసీ జన్ ఆందోళన్ తరఫున)