లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్, కమిషనర్
ఎల్లారెడ్డి,జూన్ 4:(విజయ క్రాంతి): రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎల్లారెడ్డి మున్సిపాలిటీ రెండో వార్డులోని లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మున్సిపల్ ఏఈ వినోద్ కుమార్, స్థానిక వార్డు కౌన్సిలర్ మంచిర్యాల మహేశ్వరి విద్యాసాగర్, వార్డు అధికారి అవినాష్ మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
రెండో వార్డులోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షానికే ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత అనేక సంవత్సరాలుగా ఈ సమస్య కొనసాగుతుండటంతో స్థానిక కౌన్సిలర్ మంచిర్యాల మహేశ్వరి విద్యాసాగర్ ఈ విషయాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేసి పనులను కాంట్రాక్టర్కు అప్పగించారు.
అయితే ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడంతో రానున్న వర్షాకాలంలో మళ్లీ కాలనీలు నీట మునిగే ప్రమాదం ఉందని వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, కమిషనర్ జగ్జీవన్ సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి, వెంటనే అంచనాలు (ఎస్టిమేషన్) సిద్ధం చేసి అత్యవసర చర్యలు చేపట్టి పనులు ప్రారంభించాలని మున్సిపల్ ఏఈ వినోద్ కుమార్ను ఆదేశించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బందితో పాటు స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు.






