1 June, 2026 | 2:45 AM

సీఎం సారూ.. జిల్లా గోడు వినిపించుకోరూ..!

01-06-2026 01:05 AM
  1. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు
  2. రోడ్లు, వంతెనలు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యా-వైద్య రంగాలపై ప్రజల ఆశలు
  3. సీఎం పర్యటనతో పెరిగిన అంచనాలు

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 31 (విజయ క్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం( నేడు) కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ప్రజల దృష్టి అంతా ఈ పర్యటనపైనే నిలిచింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నప్పటికీ, దశాబ్దాలుగా పరిష్కారానికి నోచు కోని సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.జిల్లా ఏర్పడి దాదాపు దశాబ్దం పూర్తవుతున్నా మౌలిక సదుపాయాల కల్పనలో ఆశించిన పురోగతి కనిపించడం లేద న్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యం గా రహదారులు, వంతెనలు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యా-వైద్య రంగాల్లో నెలకొన్న సమ స్యలుఇప్పటికీ ప్రజలనువెంటాడుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులతో రైతాంగం ఆందోళన

వ్యవసాయాధారిత జిల్లాగా పేరున్న ఇప్పటికీ వర్షాధార సాగుకే రైతులు పరిమిత మ వుతున్నారు. కుమ్రం భీమ్ ప్రాజెక్టు ప్రధాన ఆనకట్ట మరమ్మతులు ఏళ్లుగా పెండింగ్లో ఉండగా, జగన్నాథ్పూర్ ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. వట్టివాగు, చెలిమెల వాగు ప్రాజెక్టుల కాలువలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో వేల ఎకరాల ఆయకట్టు ప్రభావితమవుతోంది. సాగునీటి ప్రాజె క్టుల కు తగిన నిధులు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నత్తనడకన వంతెనల నిర్మాణం....

జిల్లాలోని అనేక వంతెనల నిర్మాణాలు సంవత్సరాలుగా కొనసాగుతు న్నా పూర్తి కావడం లేదు. ఆసిఫాబాద్ మండలంలోని గుండి వాగుపై హై లెవల్ వంతెన, కెరమెరి మండలంలోని ఆనార్పల్లి-కరంజి వాడ వంతె న, లక్మాపూర్-ప రండోలి వంతె న నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. కాగజ్నగర్-వాంకిడి మార్గంలోని కనర్గాం వంతెన నిర్మాణం కూడా నత్తనడకన సాగుతోంది. తిర్యాణి మండలంలోని నాయకపు గూడ-దుగ్గాపూర్ మధ్య వాగుపై నిర్మిస్తున్న వంతెన ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాలే దు. ప్రతి వర్షాకాలంలో ఈ గ్రామాల ప్ర జలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.

అటవీ అనుమతుల కోసం ఎదురుచూస్తున్న రహదారులు

జిల్లాలోని బెజ్జూరు, పెంచికలపేట, దహె గాం, సిర్పూర్(టి), వాంకిడి, తిర్యాణి మండలాల్లో అనేక గ్రామాలకు రహదారి సౌకర్యం ఇప్పటికీ కల్పించలేకపోతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ అటవీ శాఖ అనుమతులు లేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.ప్రత్యేకించి మొగవెల్లి-గూడెం రహదారి అటవీ అనుమతుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తోంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే గిరిజన గ్రామా లకు మెరుగైన రవాణా సౌకర్యం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, ఫారెస్ట్ క్లియరెన్స్ లేక పనులు ముందుకు సాగడం లేదు.జిల్లాలో ఇప్పటికీ వందలాది గిరిజన గ్రామాలు సరైన ర హదారి సౌకర్యానికి నోచుకోకపోవడం ఆం దోళన కలిగిస్తోంది. వర్షాకాలంలో ఒర్రెలు, వాగులు పొంగిపొర్లితే గ్రామాలు బాహ్య ప్ర పంచంతో సంబంధాలు కోల్పోతున్నాయి.

కెరమెరి ఘాట్ రోడ్డుపై ప్రమాద ఘంటికలు

కెరమెరి మండలంలోని 7 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు విస్తరణ కూడా జిల్లా ప్రజల ప్ర ధాన డిమాండ్లలో ఒకటిగా మారింది. ఇరుకైన రహదారి, ప్రమాదకర మలుపులు, పెరి గిన వాహన రద్దీ కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రహ దారిని విస్తరించాలన్న డిమాండ్ చాలా కాలంగా కొనసాగుతోంది.

ఐటీఐ కోసం గిరిజన యువత ఎదురుచూపులు..

జిల్లా కేంద్రంలో పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ) ఏర్పాటు చేయాలన్న డిమాం డ్ కూడా ఏళ్లుగా పెండింగ్లో ఉంది. వృత్తి విద్య కోసం ఇతర జిల్లాలకు వెళ్లలేని గిరిజన, పేద విద్యార్థులు అవకాశాలు కోల్పోతున్నారు. స్థానికంగా ఐటీఐ ఏర్పాటు చేస్తే యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.

విద్యా, వైద్య రంగాల్లో సమస్యల వెల్లువ...

జిల్లాలోని గురుకులాలు, వసతి గృహాలు ఇప్పటికీ మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. అనేక విద్యాసంస్థలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, సొంత భవనాల్లో కూడా గదుల కొరత, శిథిలావస్థ సమస్యలు వెంటాడుతున్నాయి.ఇక జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెం ట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉండటం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. 300 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా స్పెషలిస్టు వైద్యుల కొరత కారణంగా పూర్తి స్థాయి వైద్య సేవలు అందడం లేదని ప్రజలు వాపోతున్నారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులపై ఆశలు..

కొత్తగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణకు భారీగా నిధులు అవసరమని చెబుతున్నారు.

సీఎం పర్యటనతో మారుతాయా పరిస్థితులు..?

జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారులు, వంతెనలు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, వైద్య సదుపాయాల సమస్యలపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటనలు చేస్తారా? పెండింగ్ పనులకు నిధులు మంజూరు చేస్తారా? అనే ప్రశ్నలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

సీఎం పర్యటన కేవలం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు మాత్రమే పరిమితం కాకుండా, దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపాలని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.