20 August, 2026 | 4:07 AM

సినిమా టికెట్ ధరల పెంపు

20-08-2026 01:37 AM
  1. ఇకపై ప్రతి థియేటర్‌లో ఐదు షోలు 
  2. ఒక ఆటను చిన్న సినిమా ప్రదర్శనకు కేటాయించాలి 
  3. పండుగలకు చిన్న చిత్రాలకు ప్రాధాన్యం 
  4. ఆ నాలుగు సినిమాల అదనపు ఆదాయంలో 20 శాతం జమ చేయాలి 
  5. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ 

రాష్ట్రంలో సినిమా థియేటర్ల టికెట్ ధరలు పెరగనున్నాయి. టికెట్ల ద్వారా వచ్చిన లాభాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి, ప్రేక్షకుల సౌకర్యార్థం సినిమా టికెట్ ధరలు, థియేటర్ల నిర్వహణపై ప్రభుత్వం ఈ సరికొత్త మార్గదర్శకాలతో కొత్త జీవోను జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం ఇటు థియేటర్ యాజమాన్యాలు, భారీ చిత్రాల నిర్మాతలతోపాటు చిన్న సినిమాల రూపకర్తలు, సినీ కార్మికులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.

అత్యాధునిక 7.1 సౌండ్ సిస్టమ్, 2కే/4కే స్క్రీన్ కలిగిన సినిమా హాళ్లకు కొత్తగా ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీ హోదాను కల్పిస్తూ, నిర్ణయం తీసుకుంది. అయితే, సామాన్య ప్రేక్షకులకు సైతం సినిమా అందుబాటులో ఉండేలా ప్రతి థియేటర్‌లో కనీసం 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీ కింద సాధారణ ధరలకే ఉంచాలని జీవోలో స్పష్టంచేసింది.

అలాగే ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు రోజుకు గరిష్ఠంగా ఐదు షోలు ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించడంతోపాటు, చిన్న చిత్రాల మనుగడ కోసం ప్రతి థియేటర్‌లో రోజుకు ఒక షో తప్పనిసరిగా కేటాయించాలని ఆదేశించింది. మరోవైపు భారీ బడ్జెట్ చిత్రాలకు ఊరటనిస్తూ రూ.100 కోట్లకు పైబడిన నిర్మాణ వ్యయం కలిగిన సినిమాలకు ‘సూపర్ హై బడ్జెట్’ హోదాను ఖరారు చేసింది. ఈ హోదా పొందిన చిత్రాలకు విడుదలైన తొలి 10 రోజులపాటు టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటును కల్పిస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీంతోపాటు సినీ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. టికెట్ ధరల పెంపు ద్వారా లభించే అదనపు ఆదాయం నుంచి కార్మికుల సంక్షేమ నిధికి రూ.1 కోటి విరాళంగా జమ చేయడం తప్పనిసరి చేసింది. నాన్ ఏసీ, ఏసీ థియేటర్లతోపాటు స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో టికెట్ల ధరలపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు నిర్ణయించింది. సినిమా టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెల్లించాలని ఆదేశాలిచ్చింది. సంక్షేమం కోసం ఆ డబ్బును వినియోగిస్తామని ప్రభుత్వం తెలిపింది. తాజా ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయి.

ఆ నాలుగు సినిమాల నిర్మాతలకు కీలక సూచన

‘అఖండ 2’, ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘పెద్ది’ టికెట్ ధరల పెంపుతో వచ్చి న ఆదాయంలో 20 శాతం ఎగ్జిబిటర్ల నుంచి వసూలు చేయాలంటూ ఈ సందర్భంగా సంబంధిత నిర్మాతలకు సూచించింది. ఆ మొత్తాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సంబంధిత చిత్రాల నిర్మాతలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. 

ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలివే...

* ప్రతి రోజు ఐదు షోల ప్రదర్శనకు అనుమతి.

* ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఒక షోలో చిన్న సినిమా ప్రదర్శనకు అవకాశం ఇవ్వాలి.

* పరిమిత బడ్జెట్‌తో తీసే చిన్న సినిమాలకూ పండుగల సమయంలో ప్రాధాన్యం ఇవ్వాలి.

* రూ.100కోట్లకుపైగా పెట్టుబడితో తీసే చిత్రాలకు సూపర్ హైబడ్జెట్ సినిమాలుగా గుర్తింపు. 

* సూపర్ హై బడ్జెట్ చిత్రాలకు మొదటి 10 రోజులపాటు మాత్రమే టికెట్ ధరలు పెంచుకునే అవకాశం.

* సినీ కార్మిక సంక్షేమ నిధికి రూ.1 కోటి విరాళం ఇచ్చే చిత్రాలకే టికెట్ ధరల పెంపు. 

* 7.1సౌండ్ అంతకంటే ఎక్కవ సామర్థ్యం ఉన్న సింగిల్ స్క్రీన్లు స్పెషల్ థియేటర్లుగా గుర్తింపు. 

* మల్టీఫ్లెక్స్ ప్రమాణాలతో 2కే/4కే ప్రొజెక్షన్, ఐమ్యాక్స్, 75 అడుగుల కంటే ఎక్కువగా ఉన్న భారీ స్క్రీన్ థియేటర్లను స్పెషల్ థియేటర్లుగా గుర్తింపు. 

* ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో ఏసీ థియేటర్లకు రూ.5, నాన్ ఏసీ థియేటర్లకు రూ.3 నిర్వహణ ఛార్జీలుగా ఖరారు. 

* పేద, మధ్యతరగతి ప్రేక్షకుల కోసం ప్రతి థియేటర్‌లో 25 శాతం సీట్లు కేటాయింపు. 

* ఎయిర్ కూల్ థియేటర్లను రెండేళ్లలో ఏసీ థియేటర్లుగా మార్చుకోవాలని ఆదేశాలు. 

* ఆన్‌లైన్ టికెట్ ధరల విక్రయాలపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులే అమలవుతాయి.  

కొత్త ధరలు ఇలా.. 

నాన్ ఏసీ థియేటర్లలో.. 

నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ల ధర కనిష్ఠం గా రూ.30, గరిష్ఠంగా రూ.70. ప్రీమియం టికెట్ల ధర కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.100.

ఏసీ థియేటర్లలో.. 

నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ల ధర కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.150. ప్రీమియం కేటగిరీ టికెట్ల ధర కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.200.

స్పెషల్ థియేటర్లలో.. 

నాన్ ప్రీమియం కేటగిరీ టికెట్ రేట్లు కనిష్ఠం గా రూ.100, గరిష్ఠంగా రూ.250. ప్రీమియం రిక్లయినర్లకు కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300.

మల్టీప్లెక్స్‌ల్లో.. 

రెగ్యులర్ టికెట్లు కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250. రిక్లయినర్లకు కనిష్ఠంగా రూ.200, గరిష్ఠంగా రూ.300గా ప్రభుత్వం నిర్ణయించింది.