2 September, 2026 | 1:59 PM

ముందుగానే రుతుపవనాలు

25-04-2026 | 01:32am
  1. మే చివరి నాటికి అండమాన్, నికోబార్‌లోకి ప్రవేశం
  2. జూన్ 1 వరకు కేరళ, తమిళనాడు తీరాలకు 
  3. వ్యవసాయాధారిత పనులు త్వరగా ప్రారంభం

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ఎండలతో అల్లాడిపోతున్న ప్రజల కు భారత వాతావరణ శాఖ చల్లటి కబురందించింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందే దేశాన్ని చేరుకుంటాయని పేర్కొంది. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ (ఈసీఎండబ్ల్యూఎఫ్) ప్రకారం మే చివరినాటికే భారతదేశంలో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. మే 18 నుంచి 25 మధ్య రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

రుతుపవనాలు ప్రవేశించే ఈ ప్రాంతంలో సాధారణం కంటే 30 నుంచి 60 మి.మీ. ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. కేరళ, తమిళ నాడులోని దక్షిణ తీరాల పశ్చిమ దిశగా రుతుపవనాలు మే 25 నుంచి జూన్ 1 మధ్య తాకవచ్చని వాతావరణశాఖ పేర్కొం ది. రుతుపవనాల ప్రభావంతో అండమాన్ ఉత్తర ప్రాంతంలో ఒక ఉష్ణమండల వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉందని, దీని కారణంగా రుతుపవనాలు మరింత వేగంగా ముందుకు కదులుతాయని స్పష్టం చేసింది.

పశ్చిమ, ఉత్తర దిశలకు విస్తరిస్తాయని అంచనా వేశారు. ఆగ్నేయ అరేబియా సముద్రంపై బలమైన పశ్చిమ గాలులు ఏర్పడి తేమను నేరుగా భారత్‌లోని నైరుతి తీరం వైపునకు మళ్లిస్తాయని భావిస్తున్నారు. ఈ కారణంగా కేరళ, తమిళనాడు దక్షిణ జిల్లాల్లో సాధారణం కంటే అధికవర్షపాతం కురిసే అవకాశం ఉంది. రుతుపవనాలు వచ్చే సమయానికి ఎల్‌నినో ఉండదని అధికారి తెలిపారు.

గతేడాది కూడా రుతుపవనాలు అంచనావేసిన దానికంటే ముందే కేరళ తీరాన్ని తాకాయి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమైతే మే 25 నాటికే రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశించొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఎండలతో అల్లాడుతున్న కోట్లాది మంది ప్రజలకు ఉపశమనం లభించడమే గాక, వ్యవసాయ పనులు కూడా త్వరగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.