calender_icon.png 10 February, 2026 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్బు.. డబ్బు!

10-02-2026 12:00:00 AM

  1. పోటీపడి నగదు పంపిణీ 

ఓటుకు రూ. 5000 

ఇండిపెండెంట్ లు సైతం....

ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం 

మేడ్చల్, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంపిణీ జోరుగా సాగుతోంది. నాయకులు పోటీపడి పంపిణీ చేస్తున్నారు. ఒక పార్టీ వారు ఇచ్చిన నగదు కంటే మరో పార్టీ వారు ఎక్కువగా ఇస్తున్నారు. డబ్బు పంపిణీకి వెనుకాడడం లేదు. ఇండిపెండెంట్ లు సైతం పంపిణీ చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పంపిణీ ప్రారంభించారు.

కొన్నిచోట్ల ఒకరోజు ముందే పంపిణీ జరిగింది. ఒక మున్సిపాలిటీ పరిధిలో ఓటుకు 5000 పంపిణీ చేశారు. మరో పార్టీ వారు 3000 రూపాయలు ఇచ్చారు. ఇంట్లో అయిదారు ఓట్లు ఉంటే కొన్ని డబ్బులు ఎక్కువే ఇచ్చారు. ఒక వార్డులో ఇండిపెండెంట్ గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రత్యర్థులు డబ్బు పంపిణీ చేయడంతో ఈయన కూడా పంపిణీ చేయాల్సి వచ్చింది. ఓటుకు రూ.2500 ఇచ్చి దండం పెట్టుకున్నాడు. మూడు మునిసిపాలిటీలలో ఇదివరకే ఇంటింటికి మద్యం, మటన్ పంపిణీ పూర్తయింది. కొంతమంది అభ్యర్థులు చీరల పంపిణీ చేశారు.

అతి ఖరీదైన వార్డు 

అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఒక వార్డు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వార్డులో ఇద్దరు అభ్యర్థులు పోటీపడి ప్రచారం చేశారు. ఆర్థికంగా ఇద్దరూ బలంగా ఉండడంతో ఖర్చుకు వెనుకాడడం లేదు. చైర్ పర్సన్ అభ్యర్థులు కాకున్నప్పటికీ ఇద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ ఓటుకు రూ 10 వేల వరకు పంపిణీ జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. సోమవారం రాత్రి మంగళవారం ఈ వార్డులో పెద్ద మొత్తంలో డబ్బు పంపిణీ జరిగే అవకాశం ఉంది. 

ఓట్లు తక్కువగా ఉండడంతో పెరిగిన ఓటు విలువ 

మూడు మున్సిపాలిటీలలో వార్డులలో ఓట్లు తక్కువగా ఉండడంతో ఓటు విలువ పెరిగింది. ఒక్కో వార్డులో సగటున వెయ్యి ఓట్లు ఉన్నాయి. ఇందులో 100 ఓట్ల వరకు స్థానికంగా లేనివారు, చనిపోయిన వారివి ఉన్నాయి. ఇలా లెక్కలేసుకొని నాలుగైదు వందల ఓట్లు కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ఓట్లు ఉండడంతో ఎన్ని డబ్బులు అయినా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. 

అంచనాలు తారుమారు 

డబ్బు పంపిణీ గెలుపు ఓటమి తీవ్ర ప్రభావం చూపనుంది. డబ్బు పంపిణీ చేయని అభ్యర్థుల పోటీలో వెనుకబడిపోయారు. డబ్బు పంపిణీ చేయకముందు చేసిన సర్వేలు తారుమారయ్యే అవకాశం ఉంది. రెండు రోజుల్లో సమీకరణాలు మారిపోయాయి. మొన్నటి వరకు ప్రచారంలో వెనుకబడిన అభ్యర్థులు డబ్బు పంపిణీ చేసి ముందంజలోకి వచ్చారు. 

ముగిసిన ఎన్నికల ప్రచారం 

మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులు, పార్టీల నాయకులు వ్యూహాలలో తల మునుకలయ్యారు. ఎక్కడ తక్కు ఓట్లు పడే అవకాశం ఉందో అక్కడ ఏం చేయాలనే విషయమై పార్టీ కార్యకర్తలతో చర్చించారు. 11వ తేదీన పోలింగ్ ఉన్నందున ఈ రెండు రోజులు కీలకమయ్యాయి.