5 May, 2026 | 7:22 PM

Breaking News

చెరువు కట్టకు మరమ్మత్తులు   •   కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •  

శబ్ద కాలుష్యంపై ప్రత్యేక చర్యలు

04-03-2026 05:28 PM

కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో మాడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం

ఆకతాయిల ఆగడాలకు చెక్.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు 

సైలెన్సర్లు మార్పు చేసి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే సహించేది లేదు

 కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలో ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా మాడిఫైడ్ సైలెన్సర్లు అమర్చడం వల్ల అధిక శబ్ద కాలుష్యం ఏర్పడుతోంది. ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు మరియు రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆకస్మికంగా వచ్చే అధిక శబ్దం ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా రోడ్డు ప్రమాదాలకు కూడా దారితీసే ప్రమాదం ఉన్నది.

ఈ నేపథ్యంలో బుధవారం కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్ ఆధ్వర్యంలో, పట్టణ సీఐ శ్రీ ఎస్.ఎస్. నరహరి గారి సమక్షంలో మాడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంస కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్  మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలకు చట్టవిరుద్ధంగా మాడిఫైడ్ సైలెన్సర్లు అమర్చడం నేరమని స్పష్టం చేశారు. ఇలాంటి వాహనాలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి నేరాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి వాహనదారు రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

పట్టణ ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించే విధంగా శబ్ద కాలుష్యం సృష్టించే వారిని ఏమాత్రం సహించబోమని, అట్టి వాహనాలను వెంటనే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత, ప్రశాంతత కోసం ఇటువంటి ప్రత్యేక చర్యలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీ ఎస్.ఎస్. నరహరి, ట్రాఫిక్ ఎస్ఐ  మహేష్ , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.