కంటోన్మెంట్ ప్రజలకు ఆధునిక వైద్యం మరింత చేరువలోకి!
అల్వాల్ TIMS ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీగణేష్
అల్వాల్: కంటోన్మెంట్ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో అల్వాల్‌లో నిర్మాణంలో ఉన్న TIMS (Telangana Institute of Medical Sciences) ఆసుపత్రి పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్(MLA Sri Ganesh) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బందితో కలిసి సమీక్షించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణ దశలు, మిగిలిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ... పెరుగుతున్న జనాభాకు సరిపోయే విధంగా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా పెరగాలని అందుకే ప్రభుత్వం తగిన నిధులు కేటాయిస్తూ వేగంగా పనులు పూర్తయ్యేలా సహకరిస్తుందని తెలిపారు. పేద ప్రజలకు పెద్దాసుపత్రి అంటే కేవలం గాంధీ, ఉస్మానియా లే కాకుండా ఇలా నగరం చుట్టూ టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణం పై దృష్టి సారించిందని సూచించారు. గత బీఆర్ఎస్ హయాంలో కేవలం 14 శాతం మాత్రమే పనులు అయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చాక ఇప్పుటికి 90 శాతం పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే కంటోన్మెంట్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అత్యాధునిక పరికరాలు విదేశాల నుంచి తీసుకువస్తున్నామని ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. ఆసుపత్రి నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులకు స్పష్టం చేశారు. అదే సమయంలో పనులు నత్తనడకన సాగకుండా నిర్ణీత ప్రమాణాలు, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆర్ అండ్ బి డిపార్ట్ మెంట్ అధికారులు ఉషారాణి, ప్రదీప్ హెల్త్ డిపార్టెమెంట్ అధికారి వెంకట్రాజు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






