మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత
గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ
ఆసిఫాబాద్(విజయక్రాంతి): వన మహోత్సవంలో భాగంగా ఆసిఫాబాద్ ఆశ్రమ పాఠశాల బాలికల ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విద్యార్థి దశ నుంచే మొక్కల ప్రాధాన్యతను తెలుసుకుని వాటి సంరక్షణకు కృషి చేయాలని సూచించారు.
పాఠశాల ప్రాంగణంలో నాటిన ప్రతి మొక్కను విద్యార్థులు దత్తత తీసుకుని క్రమం తప్పకుండా నీరు పోసి సంరక్షించాలని తెలిపారు.మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించి పెద్దవిగా పెంచినప్పుడే వన మహోత్సవం లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పవార్ లింబారావ్, కూడ్మేత జంగు, బండ మీనారెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.






