గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎం ఎల్ ఏ జారే
దమ్మపేట పంచాయతీ పరిధిలో రూ.1.10 కోట్లతో అభివృద్ధి పనులు
దమ్మపేట, ఆగస్టు 02(విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ దమ్మపేట గ్రామ పంచాయతీ పరిధిలో పర్యటించి, ఒక కోటి పది లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు దమ్మపేట గ్రామ పంచాయతీ పరిధిలోని వివిధ వీధుల్లో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, అలాగే ప్రజలందరికీ ఉపయోగపడేలా నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ జారె ఆదినారాయణ మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ దమ్మపేటను మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందించే నిధులను సమర్థవంతంగా వినియోగించి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






