2 August, 2026 | 4:30 PM

ఏఎస్‌డబ్ల్యూఓ కార్యాలయం.. నిర్లక్ష్యానికి నిదర్శనం

02-08-2026 03:06 PM

అడ్రస్ లేదు.. బోర్డు లేదు..!

విద్యార్థులు, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు 

వెంటనే కార్యాలయం ఏర్పాటు చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల డిమాండ్

చుంచుపల్లి,(విజయక్రాంతి): కొత్తగూడెం సబ్ డివిజనల్(Kothagudem Sub-divisional) పరిధిలో పనిచేయాల్సిన అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి (ఏఎస్‌డబ్ల్యూఓ) కార్యాలయం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారిందని విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు కార్యాలయానికి స్పష్టమైన చిరునామా లేకపోవడం, కార్యాలయాన్ని గుర్తించే బోర్డు ఏర్పాటు చేయకపోవడం, ప్రజలకు సమాచారం అందించే ఫ్లెక్సీలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారని విమర్శిస్తున్నారు.

స్కాలర్‌షిప్‌ల మంజూరు, కులాంతర వివాహ ప్రోత్సాహక పథకాల అమలు, ఇతర సంక్షేమ సేవల కోసం కార్యాలయానికి వచ్చే విద్యార్థులు, లబ్ధిదారులు సంబంధిత అధికారి ఎక్కడ ఉంటారో తెలియక ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక పలుమార్లు తిరగాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రజావాణిలో కూడా వినతిపత్రాలు సమర్పించినప్పటికీ అధికారులు స్పందించడం లేదని  హెచ్చరించారు.