మందలపల్లి సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారె
దమ్మపేట,(విజయక్రాంతి): సోమవారం అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ దమ్మపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మందలపల్లి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రూ.57 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎంఎల్ఏ జారే స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా గ్రామీణ ప్రాంత మహిళలకు రవాణా భారం తగ్గించేందుకు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, వారి హక్కులు, శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అనంతరం దమ్మపేట మండల రెవెన్యూ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సందర్శించి పరిపాలనా పరమైన అంశాలపై ట్రైనీ కలెక్టరు(తహశీల్దార్)తో వివరంగా చర్చించారు.
రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి, ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, మందలపల్లి సర్పంచ్ కుక్కుల శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ చైర్మన్, తహశీల్దార్ ,జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీనాయకులు, డిపోమేనేజర్ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






