22 August, 2026 | 11:36 PM

ఇల్లెందు గిరిజన ఆశ్రమ బాలికల హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

22-08-2026 11:08 PM

- మరుగుదొడ్ల నిర్వహణపై అసంతృప్తి.. వార్డెన్‌పై ఆగ్రహం

- విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచనలు

- డైనింగ్ హాల్, ప్లేగ్రౌండ్ ఏర్పాటుకు హామీ

ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లెందు పట్టణం గోవింద్ సెంటర్‌లోని గిరిజన ఆశ్రమ బాలికల హాస్టల్‌ను ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లోని వసతి సౌకర్యాలు, విద్యార్థులు ఉంటున్న గదులు, వంటగది, మరుగుదొడ్లు, డైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేసి వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. తక్షణమే నూతన మరుగుదొడ్ల ఏర్పాటుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేసి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులు తినే భోజనాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార నాణ్యత విషయంలో రాజీ పడకూడదని సూచించారు.

విద్యార్థులు నిద్రించే గదులకు మెస్‌ జాలీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్‌లో విద్యార్థులకు మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డైనింగ్ హాల్‌తో పాటు ప్లేగ్రౌండ్‌ను కూడా ఏర్పాటు చేస్తామని విద్యార్థులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించారు.