గిరిజన విద్యార్థులు చదువుపైనే ప్రత్యేక దృష్టి సారించాలి
గుండాల, (విజయక్రాంతి): గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు వర్గ విభేదాలకు తావివ్వకుండా ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటూ చదువుపైనే ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. కెరీర్‌పై స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని, భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు. శనివారం గుండాల మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్‌ఎస్)ను ఐటీడీఏ పీవో సందర్శించారు. ఇటీవల పాఠశాలలో చోటుచేసుకున్న ఆందోళన నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో విడివిడిగా సమావేశమై జరిగిన సంఘటనలపై వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు గురువులను తల్లిదండ్రులుగా భావించి కష్టపడి చదవాలని సూచించారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తుపై లక్ష్యాలను ఏర్పరచుకుని, వాటిని సాధించే వరకు శ్రమించాలని అన్నారు. వివిధ గ్రామాలు, మండలాలు, జిల్లాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు ‘నీది–నాది’ అనే భావనలకు దూరంగా ఉండి పరస్పరం సమన్వయంతో మెలగాలని సూచించారు. విద్యార్థులందరూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటూ విద్యాభ్యాసంపై దృష్టి సారించాలని అన్నారు.
ఉపాధ్యాయులు విద్యార్థుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారి భవిష్యత్తుపై అవగాహన కల్పించే అంశాలను ప్రతిరోజూ తెలియజేయాలని సూచించారు. విద్యార్థులకు లేదా ఉపాధ్యాయులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. విద్యాలయాలు దేవాలయాల వంటివని, అలాంటి ప్రదేశాల్లో పోలీసుల ప్రవేశం వంటి పరిస్థితులు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు.






