చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం
ప్రజల ప్రాణాలు పోతుంటే మీకు పట్టింపు లేదా ?
పిసిబి, నీటి పారుదల శాఖల అధికారులపై ఎమ్మెల్యే జీఎంఆర్ ఫైర్
జిన్నారం/అమీన్ పూర్, ఏప్రిల్ 13: ప్రజలకు ఉపాధి లభిస్తుందని పరిశ్రమల స్థాపనకు స్వాగతం పలికితే అవే పరిశ్రమలు ప్రజల ప్రాణాలు తీస్తూ ప్రతి రోజు కాలకూట విషాన్ని వెదజల్లుతున్నాయని, తీరు మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హెచ్చరించారు.
గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని చెట్ల పోతారం పరిధిలోగల అయ్యమ్మ చెరువు పరిస్థితిపై సోమవారం మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, వివిధ శాఖల అధికారులతో కలిసి చెరువు కట్టపైనే ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువులో కాలుష్య జలాలు కలవడం మూలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే జిఎంఆర్ కు తెలిపారు.
ప్రతిరోజు ప్రత్యక్ష నరకం అనుభవించడంతో పాటు క్యాన్సర్ లాంటి వ్యాధులు సోకి ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా తమ బతుకులు చిధ్రమవుతున్నాయని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గడ్డపోతారం పరిధిలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానికులకు ఉపాధి లభించడంతో పాటు ప్రజలు ఆర్థిక అభ్యున్నతి సాధిస్తారని పరిశ్రమల ఏర్పాటుకు అంగీకారం తెలిపితే నేడు అవే పరిశ్రమలు నిబంధనలు ఉల్లంఘిస్తూ స్థానిక చెరువులను తమ రసాయన జలాలతో కాలుష్యం చేస్తూ ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని అవసరమైతే కాలుష్య పరిశ్రమలను తరిమికొడతామని హెచ్చరించారు. కాలుష్యాన్ని అరికట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై ప్రజలు నేరుగా ఫిర్యాదులు ఇస్తున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం చేతగానితనం మూలంగానే పరిశ్రమలు విచ్చలవిడిగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని అన్నారు.
శాశ్వత పరిష్కారానికి కృషి...
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. చెట్ల పోతారం నుండి కిష్టాయపల్లి, గండి చెరువు, కృష్ణారెడ్డిపేట చెరువు మీదుగా నక్క వాగు వరకు 6 ఫీట్ డయా పైపు లైన్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. చెరువు పరిధిలో కట్టుదిట్టమైన ఫెన్సింగ్ నిర్మాణం చేసి పశువులు వెళ్లకుండా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. స్థానికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న 14 పరిశ్రమలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు.
ప్రస్తుతానికి అయ్యమ్మ చెరువులోని కాలుష్య జలాలను పూర్తిగా తొలగించనున్నట్లు తెలిపారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కాలుష్య జలాలను వదులుతున్న పరిశ్రమలు సీజ్ చేయాలని ఆదేశించారు. పిసిబి ఈఈ కుమార్ పాఠక్, నీటిపారుదల శాఖ ఈఈ భీమ్, గడ్డపోతారం మున్సిపల్ చైర్మన్ సుష్మ గణేష్, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, గడ్డపోతారం మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, సీఐ రవీందర్ రెడ్డి, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, నరసింహ, ప్రకాష్ చారి, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




