బొగ్గు వెలికితీత పనులను పరిశీలించిన భట్టి, శ్రీధర్ బాబు
హైదరాబాద్: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ బొగ్గుగనిని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దుద్దుల శ్రీధర్ బాబుతో కలిసి ఆదివారం సందర్శించి, ఓపెన్ హౌస్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించి సింగరేణిలో జరుగుతున్న కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని, కార్మికుల చెమటతో ఎదిగిన ఈ సంస్థ ప్రతిష్టను రాజకీయ స్వార్థాల కోసం దెబ్బతీయాలని చూసే ప్రయత్నాలను ప్రజా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు.
సింగరేణి కార్మికుల ఆత్మగౌరవాన్ని అవమానించేలా మాట్లాడేవారిని క్షమించబోమని, సంస్థపై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను తిప్పికొడతామని పేర్కొన్నారు. సింగరేణిలో ప్రతి ప్రక్రియ పారదర్శకంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించబడుతోందని తెలిపారు.
కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వారి ఆరోగ్యం, భద్రత, పిల్లల విద్య, భవిష్యత్తు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సులు, అంతర్జాతీయ ప్రమాణాల విద్యా అవకాశాలు, ప్రమాద బీమా వంటి కార్యక్రమాల ద్వారా కార్మిక కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని వెల్లడించారు. సింగరేణిపై ఎవరైనా డేగ కన్ను వేస్తే ప్రజా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, తెలంగాణ ప్రజల ఆస్తిని కాపాడటంలో రాజీ ఉండదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.






