సీతారామ సాగర్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేకాఫ్ పాయింట్ ను పరిశీలించిన మంత్రులు
హైదరాబాద్: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం పర్యటించారు. మణుగూరులో సీతారామ సాగర్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేకాఫ్ పాయింట్ వద్ద పనులను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మార్చి మేడిగడ్డ వద్ద నిర్మించారని, కమీషన్ల కోసం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.లక్షన్నర కోట్లకు పెంచారని తెలిపారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతామని చెప్పారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయలేదని, కాళేశ్వరం ప్రాజెక్టేమో మూడేళ్లలో కూలిపోయిందని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు బీఆర్ఎస్ హయంలోనే కట్టారని, అయికూడా వారి హయంలోనే కూలిపోయాయి. వ్యాప్కోస్ చెప్పనట్లు బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టులను నిర్మించకుండా వారికి నచ్చినట్లుగా నిర్మించారని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నుంచి చుక్క నీరు తీసుకోకుండా రికార్డుస్థాయి ఉత్పత్తి సాధించామని, యాసంగిలో రైతుల నుంచి 82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.19 వేల కోట్లు చెల్లించామని గుర్తు చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయకూడదని, గేట్లు ఎత్తి ఉంచాలని ఎన్డీఎస్ఐ చెప్పిందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.






