పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి పారుదల రంగం నాశనం
తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి.. రూ. లక్షల కోట్లు అప్పు
జూరాల నుంచి శ్రీశైలానికి నీళ్లు మళ్లించడం ఘోర తప్పిదం
మహబూబ్ నగర్: ఐదేళ్లలో ఎక్కువ ఆయకట్టు పెరగబోతోందని మహబూబ్ నగర్ జిల్లా(Mahabubnagar District) పర్యటన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) తెలిపారు. సాగునీరు, తాగునీరు ఎక్కువగా అందుబాటులోకి రాబోతోందని వివరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటిపారుదల రంగం నాశనమైందని ఆరోపించారు. పదేళ్లలో తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి రూ. లక్ష కోట్లు అప్పు తెచ్చారని మంత్రి ఉత్తమ్ వివరించారు. రూ. లక్ష కోట్ల అప్పులు తెచ్చి నామమాత్రపు ఆయకట్టు తీసుకువచ్చారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం సహా ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదన్న ఉత్తమ్ కుమార్ పెద్దఎత్తున ఆయకట్టు రాలేదన్నారు. పాలమూరు-రంగారెడ్డిలో 90 శాతం ఖర్చు చేశామని చెబుతున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అవసరాలను జూరాల నుంచి శ్రీశైలానికి నీళ్లు మళ్లించడం ఘోర తప్పిదమన్నారు. రూ. 27 వేల కోట్లు ఖర్చుపెట్టి పాలమూరు-రంగారెడ్డి కింద ఒక్క ఎకరా ఆయకట్టు తీసుకురాలేదన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లలేదని ఆరోపించారు. గత పాలనలో నీటిపారుదల రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. రూ. 181 లక్షల కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రపు ఆయకట్టు తెచ్చారని వెల్లడించారు. కృష్ణా జలాల హక్కుల కోసం బీఆర్ఎస్ కంటే సమర్థంగా పోరాడుతున్నామని మంత్రి ఉత్తమ్ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) వచ్చాక కృష్ణా నదీ జలాలు ఎక్కువగా వినియోగించామన్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటిస్తున్నారు. సీఎంతోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణరావు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు జిల్లాలో నేతలు పాల్గొన్నారు. ఈ పర్యటనలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను సీఎం, మంత్రులు పరిశీలించారు.






