5 June, 2026 | 5:33 PM

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ లేఖ

05-06-2026 04:14 PM

హైదరాబాద్: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి( Union Minister Kishan Reddy) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. సింగరేణిలో జరిగిన రూ. 1600 కోట్ల కుంభకోణంపై విచారణ జరపాలని కోరారు. సింగరేణి నిల్వల నుంచి 40 లక్షల టన్నుల బొగ్గు ఎలా మాయమైంది? అని ప్రశ్నించారు. తాజాగా రూ. 1600 కోట్ల బొగ్గును రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాయం చేశారని కేటీఆర్ ఆరోపించారు. స్టాక్ యార్డుల్లో ఉండాల్సిన బొగ్గును అమ్ముకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. రూ. 1600 కోట్ల విలువ చేసే బొగ్గు ఏమైందో తక్షణమే తేల్చాలని డిమాండ్ చేశారు. సింగరేణి బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి వరుస కుంభకోణాలకు కేరాఫ్‌గా మారిందని ఆరోపించారు. నైనీ కుంభకోణం(Naini Scam) నుంచి మొదలుకొని వందల అక్రమాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని ధ్వజమెత్తారు. సింగరేణి అక్రమాలపై కాగ్ అధికారులు ఇప్పటిదాకా ఎందుకు తనిఖీలు చేపట్టలేదని ప్రశ్నించారు. ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తినా కేంద్రం నుంచి స్పందన లేదని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు తెలంగాణ ప్రజల ఆస్తి అన్న కేటీఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణిని మనుగడనే దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ములాఖత్ కాకుంటే తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక అఖిలపక్షాన్ని ఆయా గనుల వద్దకు పంపాలని బీఆర్ఎస్ పక్షాన కేటీఆర్ డిమాండ్ చేశారు.